కవిత 'బీఆర్ఎస్' మీదే పోరాటం చెయ్యాలి
బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి.
బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ మహిళా నేత పాల్వాయి స్రవంతి తాజాగా కవితపై ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో ఏడుగురి మహిళలకు మాత్రమే టికెట్లు ఇచ్చారు. కల్వకుంట్ల కవిత నీకు మహిళ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే దానిపై పోరాటం చేద్దాం రా.. మీ అయ్య మహిళల పట్ల చూపిన వివక్షపై పోరాటానికి నువ్ సిద్ధమా అని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీపైన నిందలు వేస్తున్న కవిత.. మీ నాయిన కూడా కాంగ్రెస్ లోనే రాజకీయలు చేశారు. ఆ సంగతి గుర్తుందా అని అడిగారు. జంతర్ మంతర్ దగ్గర బూటకపు పోరాటాలు చేయడం కాదు. మీ అయ్య చేతిలో అవకాశాలు ఉన్న టికెట్స్ ఇవ్వలేదు కదా.. ప్రగతి భవన్ వద్ద ధర్నా చేద్దాం రా దమ్ముంటే.. అని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కలిపించిన ఘనత ఉందన్నారు. మహిళలకు ఏఐసీసీ అధ్యక్ష పదవి, ప్రధాన మంత్రి పదవి, లోక్ సభ లో స్పీకర్ పదవీ, రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది అని వివరించారు. మహిళా రిజర్వేషన్లను రాజ్యసభలో ఆమోదించిన చరిత్ర, ఘనత మాదని అన్నారు.
నీ లిక్కర్ కుంభకోణం బయటకు రాకుండా ఉండేందుకు నువ్ జంతర్ మంతర్ వద్ద బూటకపు ధర్నా చేసావు. ఎంపీగా ఉన్న నువ్ ఏనాడైనా మహిళ రిజర్వేషన్లు గురించి మాట్లాడవా అని ప్రశ్నించారు. మీ అయ్య మహిళలకు ఏడు సీట్లు మాత్రమే ఇచ్చారు కదా.. నీకు దమ్ముంటే ప్రగతి భవన్ వద్ద ధర్నా చేద్దాం రా.. లేక గజ్వేల్ ఫామ్ హౌస్ వద్ద ధర్నా చేద్దాం రా.. అని సవాల్ విసిరారు.
మీ పార్టీ ఎప్పుడైనా పార్లమెంట్ ఈ అంశాన్ని మాట్లాడిందా.. మోదీతో అంటకాగిన మీరు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారా అని ఎద్దేవా చేశారు. సిగ్గుంటే మోదీ.. కేసీఆర్ లపై పోరాటానికి రా.. లేకపోతే మూసుకొని ఉండు.. కాంగ్రెస్ పై మాట్లాడితే ఊరుకోమ్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కవితకు మహిళల స్వావలంబనపై ఆసక్తి ఉంటే.. కాంగ్రెస్ మీద కాదు.. బీఆర్ఎస్ మీద పోరాటం చెయ్యాలని సూచించారు.