Mon Dec 23 2024 07:35:11 GMT+0000 (Coordinated Universal Time)
మనోవేదనతో బతికున్న కూతురికి శ్రద్ధాంజలి..
ఉమ్మడి పాలమూరు జిల్లా గట్టు మండలానికి చెందిన డాక్టర్ సోమేశ్వరి, ధరూర్ మండలానికి చెందిన రాజశేఖర్ లు స్కూల్ లో..
స్కూల్లో కలిసి చదువుకున్న రోజుల నుంచి ఉన్న ప్రేమను మరచిపోలేని కూతురు.. కని, పెంచి ఉన్నత చదువులు చదివించిన కూతురికి కులాంతర ప్రేమ వివాహం చేయలేని మమకారం ఆ తల్లిదండ్రులది. వెరసి.. తల్లిదండ్రులను కాదని కులాంత వివాహమే చేసుకున్న కూతురికి బ్రతికుండగానే అంత్యక్రియలు చేశారు. జులై 2న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కూతురి శ్రద్ధాంజలి ఆహ్వాన పత్రిక నెట్టింట చక్కర్లు కొడుతోంది. బతికున్న కూతురికి శ్రద్ధాంజలి ఘటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే..
ఉమ్మడి పాలమూరు జిల్లా గట్టు మండలానికి చెందిన డాక్టర్ సోమేశ్వరి, ధరూర్ మండలానికి చెందిన రాజశేఖర్ లు స్కూల్ లో చదువుకున్నప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. సోమేశ్వరి గద్వాల జిల్లా కేంద్రంలో డెంటిస్ట్ గా పనిచేస్తుండగా.. రాజశేఖర్ నారాయణపేట జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని కొన్నేళ్లుగా భావిస్తున్నారు. కానీ అందుకు సోమేశ్వరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దానికితోడు ఇంట్లో ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కులాంతర ప్రేమ వివాహం వద్దరని సోమేశ్వరిని వారించారు. అయినా వినకపోవడంతో విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వివాహం విషయం పూర్తిగా వారికి సంబంధించినది అని చెప్పిన పోలీసులు.. పెద్దల కోరిక మేరకు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.
జూన్ 6 తర్వాత సోమేశ్వరి - రాజశేఖర్ లు ఇళ్ల నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం సోమేశ్వరి కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు మనోవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే జులై 2న సోమేశ్వరికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తల్లిదండ్రులు.. తమ బంధువులకు వాట్సాప్ లో ఆహ్వానం పంపారు. ఈ విషయం ఆ నోట ఈ నోట నుంచి.. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతూ పాలమూరు జిల్లా అంతటా వ్యాపించింది. ఈ పోస్టును సోమేశ్వరి తల్లిదండ్రులే షేర్ చేశారా లేక ఇతరులెవరైనా చేశారా అని పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story