Sun Nov 17 2024 23:33:51 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ ను రవ్వంత కూడా కదల్చేరా...రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతున్నారా?
తొలి సారి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారోనన్న ఆందోళన రేవంత్ రెడ్డి నిన్న మొన్నటి వరకూ పార్టీ నేతల్లో ఉండేది.
తొలి సారి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారోనన్న ఆందోళన రేవంత్ రెడ్డి నిన్న మొన్నటి వరకూ పార్టీ నేతల్లో ఉండేది. అనుభవం ముఖ్యం కాదయ్యా... ఆత్మవిశ్వాసం ముఖ్యం అన్న రీతిలో రేవంత్ రెడ్డి ఈ ఎనిమిది నెలల ప్రయాణం సాగుతుంది. ఒకవైపు పాలనను గాడిన పెడుతూనే, మరొక వైపు పార్టీని కూడా పూర్తిగా బలోపేతం చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. రాజకీయం ఎవరు నేర్పితేనో వచ్చేది కాదు. ఒకరిని చూసి నేర్చుకునేది అంతకంటే కాదు. విల్ పవర్ ముఖ్యం. తాను చేయగలనన్న నమ్మకం తనలో పూర్తిగా నిండి ఉన్నప్పుడు అనుకున్నది సాధించేంత వరకూ ముందుకు సాగవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిరూపించారు. అనుభవం లేదన్న వారి నోళ్లు దాదాపుగా ఇప్పటికే మూత బడ్డాయి.
ఆషామాషీగా సాగలేదు...
ఎందుకంటే.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆషామాషీగా జరగలేదు. అనేక పార్టీల్లో ఉన్నా ఆయనలో ఉన్న ఫైర్ ను గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారు. అప్పుడు కూడా రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం పై టీడీపీలో అనేక విమర్శలు వినిపించాయి. సీనియర్ నేతలు చాలా మంది పెదవి విరిచారు. కానీ చంద్రబాబు నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో తనదైన పాత్రను పోషించారు.
తక్కువ అంచనా వేసి...
రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా.. పదవిలో లేకపోయినా జనం నోళ్లలో నానుతూ ఉండటమే ఆయనకు ప్లస్ అనుకోవాలి. ఆయనపై అనేక ఆరోపణలు వచ్చినా చెక్కు చెదరకుండా ముందుకు వెళ్లడమే తప్ప వెనుదిరిగి చూడలేదు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ను ఎదుర్కొనాలంటే టీడీపీలో ఉంటే సాధ్యం కాదని భావించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ కూడా రేవంత్ ను తక్కువగా అంచనా వేశారు. రేవంత్ ను ప్రజలు విశ్వసించరన్న అతి నమ్మకంతో ఆయన ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడయినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. కానీ రాష్ట్రం ఇచ్చి పదేళ్లు పాటు అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డితో ప్రయోగం చేసింది. అది సూపర్ సక్సెస్ అవుతుందని భావించి ఉండకపోవచ్చు. కానీ గుడ్డికంటే మెల్ల మేలు అన్న రీతిలో రేవంత్ ఎంపిక జరిగింది.
వచ్చిన అవకాశాన్ని....
అయితే తనకు వచ్చిన అవకాశాన్ని రేవంత్ సద్వినియోగం చేసుకున్నారు. కేసీఆర్ అవినీతిని, అక్రమాలంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందరో సీనియర్ నేతలున్నా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక వెనుదిరిగి చూడటం లేదు. ప్రధానంగా రెండు లక్షల రైతు రుణమాఫీని ఏకకాలంలో చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్న పేరు అయితే గట్టిగా సంపాదించుకున్నారు. ఇక పార్టీ కోసం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ నుంచి తేవడంలో సక్సెస్ అయ్యారు. బీఆర్ఎస్ బలాన్ని తగ్గించారా? లేదా? అన్నది పక్కన పెడితే అరకొర మెజారిటీతో ఉన్న సర్కార్ ను కూల్చేయాలన్న ఆలోచన ఎవరికీ లేకుండా చేయగలిగారు. అధినాయకత్వం నమ్మకాన్ని మరింత పెంచుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఇప్పట్లో తనకు తిరుగులేకుండా చేసుకోగలిగారన్న కామెంట్స్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
Next Story