Thu Nov 28 2024 05:47:59 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ బిల్డప్ ఇచ్చి వెళ్లిపోయారు : రేవంత్ రెడ్డి
తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వివక్ష చూపుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వివక్ష చూపుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబ్నగర్ పర్యటనలో ప్రధాని తెలంగాణ ప్రజలకు వరాలు ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చారన్నారు. గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు కొత్తగా ప్రకటించినట్లు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. గుజరాత్ మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ తెలంగాణ మీద లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలుపర్చారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ గుజరాత్ కు ప్రధానమంత్రా? లేక దేశానికా? అని నిలదీశారు.
వరాలు ప్రకటిస్తారనుకుంటే...
మహబూబ్నగర్ కు ప్రధాని వరాలు ప్రకటిస్తారని భావించామని, కానీ ఏ హామీ ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారని అన్నారు. చివరకు తెలంగాణ రాష్ట్ర ప్రకటనను కూడా మోడీ అపహాస్యం పాలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రజాధనం వృధా తప్ప మోదీ పర్యటనతో ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు.
వ్యతిరేక ఓటును...
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చడం కోసమే నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. కుటుంబ పాలనను ప్రస్తావించిన మోదీ, కుటుంబ అవినీతిని గురించి ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు పర్చిన అనేక పథకాలను తాము చెప్పగలుగుతామన్నారు. ఉచిత విద్యుత్తును ఇప్పటికీ అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయంటే ఆ పథకం అమలు జరిగింది కాంగ్రెస్ హయాంలోనేనని గుర్తు చేశారు.
Next Story