Thu Nov 28 2024 22:36:27 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ నమ్మక ద్రోహి... రేవంత్ ఫైర్
కేసీఆర్ కంటే ముందు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిందని పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
హైదరాబాద్ : కేసీఆర్ కంటే ముందు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిందని పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అంతకు ముందే 42 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి తెలంగాణ ఇవ్వాలని హైకమాండ్ కు లేఖ పంపారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని, కానీ కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్య పెట్టి ముఖ్యమంత్రి అయ్యారని రేవంత్ రెడ్డి అన్నారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ నేతలు నిరుద్యోగ నిరసన దీక్షను ప్రారంభించారు.
యూత్ కాంగ్రెస్ అంటేనే...
కేసీఆర్ కు యూత్ కాంగ్రెస్ అంటేనే వణుకుపుడుతుందన్నారు. నిద్రకూడా పోరన్నారు. తెలంగాణ ఇచ్చి ఏపీలో పార్టీ సర్వనాశనమైనా పరవాలేదని సోనియా అనుకున్నారని, కానీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోవడం విచారకరమన్నారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తానే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడినై ఉంటే కేసీఆర్ కు నిద్ర లేకుండా చేసేవాడినని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కోతుల గుంపునకు...
కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపునకు అప్పగించినట్లయిందన్నారు. కేసీఆర్ నిరుద్యోగ యువతను పట్టించుకోలేదన్నారు. అధికారంలోకి వస్తే లక్షా యాభై వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. కేసీఆర్ ను నోటిఫికేషన్ ను ఇక అడగాల్సిన పనిలేదని, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీని చేసుకుందామని చెప్పారు. పన్నెండు నెలలు కష్టపడాలని, కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు.
- Tags
- revanth reddy
- kcr
Next Story