Sun Nov 17 2024 18:49:17 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ ఇక అసెంబ్లీకి రాకపోవచ్చు.. రీజన్లు ఇవే
మూడో సారి ముఖ్యమంత్రి కావాలని భావించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు.
మూడో సారి ముఖ్యమంత్రి కావాలని భావించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. ఆయన ఓటమి నుంచి కోలుకోలేకపోతున్నారు. పార్టీ అధినేత ఆయన గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలవడానికి కూడా ఇష్టపటం లేదు. ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. నిన్న రాత్రి ప్రభుత్వం ఇచ్చిన కాన్వాయ్ ను వదిలేసి వెళ్లిపోయిన కేసీఆర్ ముఖ్యమైన నేతలు ఎవరికీ అందుబాటులోకి రాలేదు. కనీసం ఫోన్లో కూడా ఆయన కలిసే అవకాశం లేదు. దీంతో పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ఆ బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. వారితో సమావేశమై ఓటమి పై పోస్టుమార్టం చేసే అవకాశముంది.
తెలంగాణ భవన్ కూడా...
కేసీఆర్ ఉంటే అదొక భరోసా. ఆయనను తమను నడిపించుకుని అసెంబ్లీకి తీసుకు వెళతాడన్న నమ్మిక చాలా మంది నేతల్లో ఉండేది. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ తమకు భరోసా కల్పించేవారని సీనియర్ నేతలు సయితం భావిస్తుంటారు. అలాంటి కేసీఆర్ అందుబాటులోకి రాకపోవడంతో చాలా మంది నేతలు నిరాశకు లోనయ్యారు. తెలంగాణ భవన్లో కూడా పెద్దగా సందడి లేకుండా పోయింది. పదేళ్ల పాటు కళకళలాడిన భవన్ ఒక్క ఓటమితో వెలవెల బోతుండటాన్ని నేతలు సయితం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇందుకు కొంచెం సమయం పట్టే అవకాశముంది. అయితే ఇప్పుడు కేసీఆర్ కూడా కొంత కాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశాలే ఉన్నాయి.
లోక్సభ ఎన్నికల వరకూ...
పార్లమెంటరీ సమావేశాన్ని కూడా ఈసారి కేసీఆర్ నిర్వహించలేదు. ఇక లోక్సభ ఎన్నికల వరకూ కేసీఆర్ నేతలకు అందుబాటులోకి రాకపోవచ్చన్న చర్చ పార్టీలోనే నడుస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ ఆయన తిరిగి యాక్టివ్ అవుతారని భావిస్తున్నారు. అప్పటి వరకూ ఆయనను కదిలించడం కూడా కష్టమే. ఆయనను చూస్తే తమకు కన్నీళ్లు ఆగవని, అందుకనే ఆయన దగ్గరకు వెళ్లే సాహసాన్ని కూడా చేయలేకపోతున్నామని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారంటే ఓటమితో ఎంత కుంగిపోయారో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ పదేళ్లు తెలంగాణలో చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా నడించింది. కానీ కారణాలు ఏవైనా ఓటమితో ఆయన కొన్నాళ్ల పాటు ఫాం హౌస్ లో విశ్రాంతి తీసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్ష నేతగా కూడా....
ఇక అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు ఉన్న తాను ప్రతిపక్ష నేత హోదాలో ఆ సభలో కూర్చోవడం చిన్నతనంగా ఆయన భావించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణను తెచ్చిన తనకు ఇంత త్వరగా ప్రతిపక్ష స్థానం దక్కుతుందని ఆయన కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆయన ప్రతిపక్ష నేతగా కూడా కేటీఆర్ ను కాని, మరొక నేతకు గాని అప్పగించే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తం మీద కేసీఆర్ రెండుసార్లు గెలుపును చవి చూసిన కేసీఆర్ మూడో సారి ఓటమిని మాత్రం తట్టుకోలేకపోతున్నారన్నది వాస్తవం.
Next Story