Sat Nov 23 2024 05:18:05 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇంధన ధరలూ పెరిగిపోవడంతో సామాన్యుడిపై భారం అధికమవుతుంది.
న్యూ ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవలే కేంద్రం లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 సుంకాన్ని తగ్గించింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరల నుంచి కాస్త ఉపశమనం దొరికిందని అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై 17 పైసలు, డీజిల్ పై 16 పైసలు పెరిగింది. దీంతో నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.83కి చేరుకుంది. డీజిల్ ధర రూ.97.98కి పెరిగింది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.92గా, డీజిల్ ధర రూ.99.65గా ఉంది.
నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇంధన ధరలూ పెరిగిపోవడంతో సామాన్యుడిపై భారం అధికమవుతుంది. పెట్రోల్, డీజిల్ లతో పాటు.. ఇటీవలే వంటగ్యాస్ సిలిండర్ ధరలనూ పెంచాయి చమురు సంస్థలు. మరోవైపు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం గ్లోబల్ మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో గోధుమలకు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. భారత్ లోనూ గోధుమ దిగుబడి తగ్గడంతో.. గోధుమలు ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరోవైపు పంచదార ఎగుమతులపై కూడా కేంద్రం ఇటీవలే నిషేధం విధించింది.
Next Story