Wed Jan 15 2025 08:48:20 GMT+0000 (Coordinated Universal Time)
నీటమునిగిన పీర్జాదిగూడ, నాగారం మున్సిపాలిటీలు
శేరిలింగంపల్లి, చందానగర్, మదీనాగూడ, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, పలు ప్రాంతాల్లోనూ..
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సాయి సంజీవనగర్ కాలనీ, అరవింద్ నగర్, సత్యనారాయణ కాలనీ, బీఎంఆర్ కాలనీ తదితర కాలనీల్లోని ఇండ్లలోకి వరదనీరు చేరింది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటిని ఇళ్లలో నుంచి బయటకు తోడేందుకు నాగారం మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
శేరిలింగంపల్లి, చందానగర్, మదీనాగూడ, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, పలు ప్రాంతాల్లోనూ భారీవర్షానికి వరద నీరు రోడ్లపై ఏరులై పారుతోంది. లింగంపల్లి నుండి గచ్చిబౌలికి వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో.. ఆ మార్గంమీదుగా అధికారులు, పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. హైదరాబాద్ శివారులోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న కాలనీలు కూడా నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా.. ఎగువ ప్రాంతాల నుండి దిగువ ప్రాంతాలకు వర్షపు నీరు రావడంతో.. విష్ణుపురి కాలనీతో పాటు పక్కనే ఉన్న వివిధ కాలనీల్లోకి భారీగా వరద వచ్చి చేరడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇండ్లలోకి మురికినీరు చేరడంతో పెద్దలు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు.
వరదనీటితో పాటు చెట్లు, పొదల్లో ఉండిపోయిన పాములు కూడా జనారణ్యంలోకి రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చెంగిచెర్ల పై నుంచి వరద నీరు అంతా కూడా పీర్జాదిగూడ విష్ణుపురి కాలనీ వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. గత ఐదేళ్లుగా భారీ వర్షాలు కురిసినప్పుడల్లా తామంతా ముంపు సమస్యను ఎదుర్కొంటున్నామని.. రాజకీయ నాయకులు, అధికారులు వచ్చిపోతారే తప్ప.. సమస్యకు పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పాముల బెడదతో రాత్రికిరాత్రే ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు చేరుకుని తలదాచుకున్నారు.
Next Story