Mon Dec 23 2024 12:01:51 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కుటుంబంపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఆయన ప్రసంగంలో రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు తీరును ఎండగట్టారు. కేసీఆర్ సర్కారు అంటే.. అదో కుటుంబ పాలన వ్యవస్థ..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. తొలుత మామునూరు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో.. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే 5 నిమిషాల పాటు ధ్యానం చేశారు. మోదీ ఆలయంలో ఉన్నంత సేపు ఆలయ పరిసరాలను నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ఇక అక్కడి నుంచి నేరుగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభా వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.. తెలంగాణ రాజకీయాలను ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ప్రసంగంలో రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు తీరును ఎండగట్టారు. కేసీఆర్ సర్కారు అంటే.. అదో కుటుంబ పాలన వ్యవస్థ అని ప్రధాని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టుల్లో అవినీతి లేని, జరగని ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. తెలంగాణ .. కేసీఆర్ హయాంలో అవినీతిలో కూరుకుపోయిందని, కుటుంబ పార్టీల పాలన తెలంగాణ ఇలా అవుతుందని తాను ఏనాడూ ఊహించలేదని మోదీ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర సంస్థలు గురిపెట్టాయని, స్కాం ల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ కొత్త నాటలకాలకు తెరలేపారని ఆరోపించారు.
జన్ సంఘ్ కాలం నుంచి వరంగల్ బీజేపీకి కంచుకోటగా ఉందన్న మోదీ.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని మోదీ మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ హయాంలో తెలంగాణ అభివృద్ధి ఖాయమన్నారు. బీఆర్ఎస్ కు రాత్రి..పగలు తేడాలేకుండా మోదీ ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా ఉంది తప్ప అభివృద్ధిపై దృష్టి లేదన్నారు. తెలంగాణను బీఆర్ ఆర్థికంగా కుదేలయ్యేలా చేసిందని, కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందని విమర్శించారు. దళితులు, బలహీన వర్గాలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు.
గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పనులు చేపట్టిందన్న మోదీ.. గ్రామీణుల ఆదాయం పెంచేందుకు ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ - బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని ప్రధాని నరేంద్రమోదీ హన్మకొండ విజయసంకల్ప సభా వేదికగా స్పష్టం చేశారు.
Next Story