తెలంగాణలో ప్రధాని మోదీ పవర్ ఫుల్ స్పీచ్
తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సభలో మాత్రం టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నానని..అవినీతికి పాల్పడేవారిని వదిలిపెట్టనని అన్నారు. తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీని ఆదరిస్తున్నారని దీనికి కారణమైన బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులను తట్టుకుని బీజేపీ కార్యకర్తలు అడుగులు ముందుకు వేస్తున్నారని.. అటువంటి కార్యకర్తలు కేవలం బీజేపీకి మాత్రమే ఉంటారన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం దిగివచ్చిందని.. తెలంగాణ అనే సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని అధికారంలోకి వచ్చినవారు ముందుకెళుతుంటే తెలంగాణ ప్రజలు మాత్రం వెనుబడే ఉన్నారని తెలంగాణను వెనుకబాటుకు గురిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని బలపరుస్తున్నారని.. మరింత పోరాటంతో బీజేపీ కార్యకర్తలు ముందుకెళ్లాలని కోరారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలని.. నేను కూడా మీలా ఓ సాధారణ కార్యకర్తలా పైకి వచ్చిన వ్యక్తినేనని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి రెండూ మూడు సీట్లు కాదు మొత్తం సీట్లు బీజేపీకి దక్కాలని.. దాని కోసం కార్యకర్తలు కృషి చేయాలని..చేస్తారనే నమ్మకం నాకుంది అని అన్నారు.