బండరాళ్ల మధ్య ఇరుక్కున్న రాజు సేఫ్.. 42 గంటల నరకయాతన
బండరాళ్ల మధ్య సెల్ ఫోన్ పడిపోవడంతో తీసుకునేందుకు యత్నించిన రాజు.. తిరిగి బయటకు రాలేకపోయాడు.
కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడం తెలిసిందే. 42 గంటలుగా అతను నరకయాతన అనుభవించాడు. బండరాళ్ల మధ్య సెల్ ఫోన్ పడిపోవడంతో తీసుకునేందుకు యత్నించిన రాజు.. తిరిగి బయటకు రాలేకపోయాడు. పెద్ద బండరాళ్ల మధ్య తలకిందులుగా చిక్కుకుపోయాడు. రాజును బయటికి తీసేందుకు రెండు జేసీబీలు, ఇతర యంత్రాలను ఉపయోగించారు. బండరాళ్లను తొలగించి రాజు ప్రాణాలను కాపాడారు. గాయాలపాలైన రాజును వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కాగా.. వేటకు వెళ్లినరాజు బండల మధ్య ఇరుక్కుపోగా, వేట నిషిద్ధం కావడంతో అతడిపై కేసు నమోదు చేస్తారని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వలేదు. రాజు స్నేహితుడు అక్కడే ఉండి ధైర్యం చెప్పాడు. అతడిని బయటికి తీసేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ప్రయత్నాలు విఫలం కావడంతో, ధైర్యం చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అటవీశాఖ సిబ్బంది, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో అతడిని సురక్షితంగా వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.