Mon Dec 23 2024 18:18:21 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : అందరూ ఒక వైపు... రేవంత్ రెడ్డి ఒక్కడూ ఒక వైపు
హైడ్రా బుల్డోజర్ కు రాజకీయ పార్టీలు బ్రేకులు వేసేటట్లే కనిపిస్తుంది. దీనికి రాజకీయ రంగు పులుముకుంది
హైడ్రా బుల్డోజర్ కు రాజకీయ పార్టీలు బ్రేకులు వేసేటట్లే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే ఒక వైపు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపుగా పరిస్థితి మారింది. గత నెలరోజుల నుంచి హైడ్రా దూకుడుగా ముందుకు వెళుతుంది. చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించిన వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేస్తుంది. ఇందులో రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. సామాన్యులు మాత్రం ఎవరూ లేరు. ఇక అక్రమంగా నిర్మించిన తమ కట్టడాలను ఎక్కడ కూల్చివేస్తారోనని బిల్డర్లకు కూడా భయం పట్టుకుంది. అన్నీ వెరసి రాజకీయ పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒంటి కాలు మీద లేస్తున్నాయి.
నెల రోజుల నుంచి జరుగుతున్నా...
హైడ్రా ఇప్పటి వరకూ పద్దెనిమిది చోట్ల కూల్చివేతలను చేపట్టింది. దీంతో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులను ఆక్రమించి పెద్దపెద్ద భవంతులను కట్టారు. అయితే ఇది మొదలు మాత్రమే. ఇంకా చాలా మిగిలి ఉంది. అనేక ఫాం హౌస్ లో ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. బఫర్ జోన్ ను ఆక్రమించి మరీ బడాబాబులు నిర్మాణాలు చేపట్టారు. కేవలం ఫాం హౌస్ లు మాత్రమే కాదు మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీలను నిర్మించారు. వారు ముందుగానే జాగ్రత్త పడి న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే లు తెచ్చుకుంటున్నారు. దీంతో వాటి జోలికి వెళ్లడానికి బుల్ డోజర్ కు బ్రేకులు పడినట్లయింది.
పొలిటికల్ పార్టీలు...
ఇక ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని పార్టీలూ ఏకమై తమ గొంతును హైడ్రా వైపు తిప్పాయి. రాజకీయ కుట్రలుగా దీనిని కొట్టిపారేస్తూ తేలిక పర్చే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా ఒక వైపు మాత్రమే చూస్తుందని, రెండో వైపు చూడటం లేదని ఆరోపిస్తూ మానసికంగా అధికారులను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ తొలి నుంచి ఈ కూల్చివేతలను వ్యతిరేకిస్తుంది. ఇక బీజేపీ మాత్రం ఎంఐఎం నేతల ఆస్తుల జోలికి ఎందుకు పోరంటూ ప్రశ్నలు సంధిస్తుంది. అయితే ఇప్పటికే ఎంఐఎం, ఎమ్మెల్సీల నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. ఎంఐఎం అయితే ప్రభుత్వ భవనాలు కూడా ఎల్ఎఫ్టీ పరిధిలో ఉన్నాయని వాటిని కూల్చేస్తారా? అని ప్రశ్నిస్తుంది.
రేవంత్ స్పందించిన తర్వాతే....
కానీ ఇదంతా రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చివేతలపై స్పందించిన తర్వాతనే రాజకీయ పార్టీల నేతల నోళ్లు తెరుచుకున్నాయి. చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను దేనినీ వదలబోమని ఆయన స్పష్టం చేశారు. చెరువులకు పూర్వ వైభవం తెస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. రాజకీయ పార్టీల నేతలు కూడా తమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే సహకరించాలని కోరారు. అదిగో అప్పటి నుంచే ఈ రచ్చ మొదలయింది. కొందరు హామీలు అమలు చేయలేక డైవర్ట్ రాజకీయాలు చేస్తారంటున్నారు. మరికొందరు ముందు మమ్మల్ని కాల్చమని ఛాలెంజ్ లు విసురుతున్నారు. మరికొందరు దమ్ముంటే అవతల వారి భవనాలను కూల్చివేయండి అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే హైడ్రాకు రాజకీయ చెదలు పట్టుకున్నట్లే కనిపిస్తుంది.
Next Story