Fri Dec 20 2024 08:59:03 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దారెటు
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తారని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారోననే సస్పెన్స్ వెంటాడుతూ ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే..! దీనిపై శ్రీనివాసరెడ్డి స్పందించారు.. కులవృత్తులు చేసే వారికి లక్ష ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలని అనుకుంటూ ఉన్నారని అన్నారు. కులవృత్తులకు రూ.లక్ష ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ఉచ్చులో పడి ప్రజలు మోసపోకూడదని కోరారు.
ఖమ్మంలో ఆయన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగిస్తూ.. లక్ష రూపాయల హామీ వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమన్నారు. కేసీఆర్ మాటలను నమ్మవద్దని బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆయన మిమ్మల్ని మోసం చేసేందుకు వెనుకాడరని మాజీ ఎంపీ అన్నారు.టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీకి అవకాశం కల్పించి కల్వకుంట్ల కుటుంబం లక్షలాది మంది విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు. గ్రూప్ పరీక్షల తర్వాత తమ జీవితాలు మారుతాయని ఆశించిన నిరుద్యోగ యువత ప్రశ్నపత్రం లీక్ కారణంగా ఇబ్బంది పడుతున్నారని పొంగులేటి ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ వల్ల కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే మేలు జరుగుతుండగా రైతులు చాలా వరకూ నష్టపోయారని ఆరోపించారు.
అక్రమంగా మట్టిని రవాణా చేస్తూ తన అనుచరులతో కలిసి కోట్లకు పడగలెత్తిన ఖమ్మం ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అనేక తప్పులకు పాల్పడిందని, అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ తప్పులను లెక్కిస్తున్నారని.. సమాధానం చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, మూడోసారి గులాబీ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని టీజేపీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు.
Next Story