Fri Nov 22 2024 20:31:24 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : ఆ పార్టీ కుటుంబానికి నిధుల మూటలు ఇక్కడి నుంచే
పదేళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
పదేళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దోచుకోవడానికి సిద్ధమయిందన్నారు. జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతుందని అన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీలోని కుటుంబానికి నిధులు వెళుతున్నాయని మోదీ ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయని చెబుతున్నారని ఆయన అన్నారు.
మే 13న చరిత్ర సృష్టించబోతున్నారు...
వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని అన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఫైళ్లను పక్కన పెడుతుందన్నారు. మహిళలు ఈసారి బీజేపీని ఆశీర్వదిస్తారని ఆయన అన్నారు. మల్కాజ్గిరిలో కూడా ప్రజలు రోడ్ షోకు అత్యధికంగా తరలి వచ్చి ఆశీర్వదించారని తెలిపారు. తనకు ప్రతి మహిళ ఒక శక్తి రూపంలా కనిపిస్తుందని ఆయన అన్నారు. శక్తిని వినాశనం చేస్తానని ఇదే శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చిందని ఆయన తెలిపారు.
స్కామ్ లన్నింటికీ...
దేశంలో జరిగిన స్కామ్లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణమని మోదీ మండిపడ్డారు. కుటుంబ పార్టీలను రాజకీయాల నుంచి తరిమి కొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. మూడోసారి మోదీ సర్కార్ ను తీసుకు రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. దేశంలో పేదలను పేదరికం నుంచి కాపాడటమే తమ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆయన వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అవినీతిపై విచారణలు చేయడాన్ని ప్రారంభిస్తే మోడీని తిట్టడానికి సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లు బీజేపీకి ఎక్కువ వస్తే అంత శక్తి తనకు వచ్చినట్లవుతుందని మోదీ అన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తెలుగు వాళ్లున్నారన్నారు. ఉన్నతస్థాయిలో ఉన్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీని ఆశీర్వదించి అత్యధిక స్థానాలు విజయం సాధించేలా సహకరించాలన్నారు. ధర్మపురి అరవింద్, బండి సంజయ్ కుమార్, గోమాస శ్రీనివాస్లను నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి నుంచి గెలిపించాలని ప్రదాని మోదీ కోరారు.
Next Story