Mon Dec 23 2024 23:34:30 GMT+0000 (Coordinated Universal Time)
కరప్షన్, కమీషన్ ఆ పార్టీల విధానం : మోదీ
కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు
కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కారును నడిపే వారు వేరే వారన్నారు. పార్టీలను ప్రయివేటు కంపెనీ లిమిటెడ్గా మార్చారన్నారు. కుటుంబ సభ్యులకే పదవులు దక్కుతాయని అన్నారు. బయట వ్యక్తులకు ఎలాంటి ప్రయోజనాలు దక్కవని మోదీ అన్నారు. కరప్షన్, కమిషన్ రెండూ ఆ పార్టీల విధానమని అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఈ కుటుంబ పార్టీలను నమ్మవద్దని మోదీ పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
అనేక ప్రాజెక్టులకు...
ఈరోజు తెలంగాణలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పాలమూరులో జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగించారు. దేశంలోని ప్రతిమూలలా పరిశుభ్రత ఉద్యమంలా సాగిందన్నారు. ఈరోజు శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టుల ద్వారా అనేక రాష్ట్రాలతో కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. సదుపాయాలు కూడా పెరుగుతాయని చెప్పారు. తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పరిశుభ్రతను ప్రజా ఉద్యమంలా మార్చామని తెలిపారు. నా కుటుంబ సభ్యులారా అని తెలుగులో ప్రసగించారు. 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టానని తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అర్థమైందన్నారు. అవినీతి కాదు పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ఎన్నో పథకాలను...
రాణి రుద్రమవంటి నాయకురాళ్లు నడిచిన నేల ఇది అని మోదీ అన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లు ద్వారా మహిళల సంఖ్య కూడా తెలంగాణలో పెరుగుతుందన్నారు. ఇక్కడి మహిళల కోసం ఢిల్లీలో ఒక అన్న ఉన్నారన్న విషయం గుర్తుంచుకోమని తెలిపారు. ఎటువంటి గ్యారెంటీ లేకుడా ముద్ర రుణాలను అందిస్తున్నామని చెప్పారు. మహిళల జీవితాలను మెరుగుపర్చేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని చెప్పారు. ప్రతి పల్లె నుంచి పట్టణానికి వచ్చేందుకు రహదారులను నిర్మించామని చెప్పారు. మహిళల కోసం లక్షల సంఖ్యలో టాయిలెట్లు కట్టించామని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని నరేంద్ర మోదీ తెలిపారు.
రైతుల కోసం...
తెలంగాణ రైతుల కోసం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించామని చెప్పారు. రైతుల కోసం ఎంఎస్పి ద్వారా 27 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఆ సొమ్ము కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవతుందని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని అన్నారు. సాగునీటి కాల్వలు ఏర్పాటు చేశామని ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది కాని, ఆ కాల్వల్లో నీరు ఉండదని మోదీ ఎద్దేవా చేశారు. పసుపు ఎగుమతులు ఎక్కువయ్యాయని, అందుకే తెలంగాణకు పసుపు బోర్డును ప్రకటించామని చెప్పారు. తెలగాణ సంస్కృతి విశ్వ వ్యాప్తం చేశామని మోదీ తెలిపారు. ఇక్కడ జరిగే ప్రతి ఉత్పత్తికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని తెలిపారు. చేతివృత్తుదారులను ప్రోత్సహించేందుకు విశ్వకర్మ యోజనను తీసుకువచ్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీకి భూమి ఇచ్చేందుకు ఐదేళ్లు పట్టిందని మోదీ అన్నారు.
Next Story