Sun Mar 30 2025 17:24:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : వారం రోజుల్లో మీ చేతుల్లో రేషన్ కార్డులు... మీరు అర్హులేనా? తెలుసుకోవాలని ఉందా?
తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయింది. ఇప్పటికే అధికారులు వెరిఫికేషన్ ప్రారంభించారు.

తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయింది. ఇప్పటికే అధికారులు వెరిఫికేషన్ ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేస్తున్నారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ దఫా రేషన్ కార్డు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. పేదలు ఎప్పటి నుంచో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుందామని భావించినా పదేళ్ల నుంచి దానికి అవకాశం లభించలేదు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ముడి పడి ఉండటంతో పాటు రేషన్ కార్డుతో బియ్యం, పంచదార వంటివి అందుతుండటంతో పాటు ఆరోగ్య శ్రీ సేవలు లభించడం, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ తదితర పథకాలు అందాలంటే తెలుపు రంగు రేషన్ కార్డు అవసరం.
యమా డిమాండ్...
తెల్ల రంగు రేషన్ కార్డుకు యమా డిమాండ్ ఉంది. రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఈ కార్డుతోనే లభించనున్నాయి. అయితే ఇందుకోసం ఇప్పటికే సర్వే ప్రారంభించారు. రేషన్ కార్డులు లేని అర్హులైన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26వ తేదీ నుంచి జారీ చేయడం ప్రారంభిస్తారు. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించి గ్రామసభలద్వారా లబ్దిదారులను నిర్ణయించే ప్రక్రియను చేపట్టారు. గ్రామ సభల్లో వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత మాత్రమే తుది జాబితాను సిద్ధం చేయనున్నామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లోనే అత్యధికంగా..
ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు తెలంగాణలో 6.68 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రాధమికంగా అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. గత ఏడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కార్డులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ లోనే అత్యధికంగా తెలుపు రంగు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డుల లబ్దిదారులను గుర్తించినట్లు తెలిసింది. దాదాపు 90 వేల మంది హైదరాబాద్ నగరంలోని వారికే రేషన్ కార్డులు మంజూరు చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద మరో వారం రోజుల్లో రేషన్ కార్డు మీ చేతుల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి.
Next Story