Thu Nov 21 2024 13:03:22 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఎందుకురా భయ్ .. ఈ సర్వేలు.. నాలుక గీచుకోవడానికి కూడా?
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే పై జనాభిప్రాయం వింతగా కనిపిస్తుంది. సమగ్ర సర్వే పై ప్రజలు పెదవి విరుస్తున్నారు
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే పై జనాభిప్రాయం వింతగా కనిపిస్తుంది. సమగ్ర సర్వే పై ప్రజలు పెదవి విరుస్తున్నారు. సర్వే వల్ల తమకు ఉపయోగం ఏంటన్న ప్రశ్న కుటుంబాల నుంచి ఎదురవుతుంది. ప్రభుత్వ పథకాలు ఇస్తారంటే ప్రజలు ఆసక్తిని సాధారణంగా కనపరుస్తారు. కానీ ఉత్తుత్తి సర్వే వల్ల తమకు ప్రయోజనకరమేంటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకీ ఉపయోగం లేని సర్వేలంటూ ప్రజలు అక్కడక్కడా సిబ్బందిపై తిరగబడుతున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెనుదిరుగుతున్నారు ప్రభుత్వ సిబ్బంది. ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో నివాస ప్రాంతాలను సిబ్బంది గుర్తించారు. ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేశారు.
గంట సేపు...
మూడు రోజుల పాటు స్టిక్కర్లు వేసే కార్యక్రమం జరిగింది. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులు వస్తుండటం దాదాపు యాభై ప్రశ్నలకు పైగానే వేస్తూ సమాధానాలు చెప్పమని అడుగుతుండటంతో కొంత విసుగుకు ప్రజలు లోనవుతున్నారు. ఒక్కో కుటుంబం వద్ద గంట సేపు ప్రశ్నలకే పడుతుండటంతో వారు కొన్నింటికి సమాధానం చెప్పలేక మరికొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సమగ్ర సర్వే ఎందుకు జరుగుతుందన్నది ప్రజలకు ఎన్యుమరేటర్లు వివరించలేకపోతున్నారు. దీంతో ఎందుకొచ్చిన సర్వే అంటూ వారు విసుగు చెంది ఏదో సిబ్బంది అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చి మిగిలిన వాటికి దాటవేస్తున్నట్లు తెలిసింది.
తమకు ప్రయోజనం ఏంటి..?
సమగ్ర సర్వే వల్ల బీసీలకు మాత్రమే ప్రయోజనం అన్న టాక్ బాగా పడిపోయింది. సర్వే వల్ల తమకు గతం నుంచి అందుతున్న పథకాలు రాకుండా ఎక్కడ పోతాయోనన్న ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. ఆధార్ కార్డు నెంబరు ఇచ్చేందుకు కూడా కొందరు ఇష్టపడటం లేదు. ఇక తమ ఆదాయం విషయంలో కూడా స్పష్టత రాకుండా పోయింది. ఆదాయం తమకు వచ్చేది చెబితే ప్రభుత్వ పథకాలు అందవేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే కొన్ని పథకాలు అందకుండా పోయాయి. దీంతో తమ పూర్తి వివరాలను అందించేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో అసలు ప్రభుత్వ ఆలోచన నెరవేరుతుందా? ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అన్న సందేహం నెలకొంది.
గ్రామీణ ప్రాంతాల్లో...
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే తమకు ఉన్న పొలం వివరాలను కూడా సక్రమంగా చెప్పడం లేదు. ఎన్ని ఎకరాలుంటే రైతు భరోసా ఇస్తుందో ఏ ప్రభుత్వం అని సందేహం పట్టిపీడుస్తుండటంతో తమకు ఎన్ని ఎకరాలున్నదీ ఎన్యుమరేటర్లకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఇక సొంత ఇల్లు విషయంలోనూ అసలు నిజం చెప్పకుండా కొందరు దాచేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ కొడుకు పేరు, కుమార్తెల పేర్ల మీద ఇల్లు ఉందని చెబుతూ తప్పించుకుంటున్నారు. అందుకే తమ వ్యక్తిగత వివరాలను చెప్పడానికి ఇష్టపడకపోవడంతో ఈ సర్వే అసలు లక్ష్యం నెరవేరే అవకాశం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తుంది.
Next Story