Sun Nov 17 2024 21:34:27 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రాజ్యసభ పదవి ఆయనకేనా? హైకమాండ్ డిసైడ్ చేసిందా?
తెలంగాణలో రాజ్యసభ ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ స్థానం దక్కుతుంది.
తెలంగాణలో రాజ్యసభ ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ స్థానం దక్కుతుంది. బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ కే రాజ్యసభ పదవి దక్కుతుంది. కె.కేశవరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో ఈ ఎన్నిక జరుగుతుంది. కేకే రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఈ పోస్టుకు ఎన్నిక జరుగుతుంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. రాజ్యసభ స్థానం దక్కించుకోవడానికి అనేక మంది పోటీ పడుతున్నారు. సీనియర్ నేతల నుంచి గత ఎన్నికల్లో టిక్కెట్ రాని వాళ్లంతా ఈ పోస్టుకోసం ప్రయత్నిస్తున్నారు.
నమ్ముకున్న నేతలకు...
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు కొదవలేదు. పార్టీని నమ్ముకుని పదేళ్ల నుంచి ఉన్న వారు అనేక మంది ఉన్నారు. పార్టీ జెండాను వదలకుండా అధికారంలోకి వచ్చినా, రాకపోయినా పార్టీని బలోపేతం చేయడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వాళ్లంతా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయిన నేతలు కూడా తమకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని తెలిసింది. తాము ఇన్నేళ్లు పడిన కష్టానికి తమకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. హైకమాండ్ ఇంకా దీనిపై వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు.
సీనియర్ నేతలు...
అయితే సీనియర్ నేత వి. హనుమంతరావు ఈ పోస్టుపై బాగా ఆశలు పెట్టుకున్నారు. అలాగే గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని అద్దంకి దయాకర్ సయితం తనకు పదవి వస్తుందని ఆశతో ఉన్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన మధుయాష్కీ వంటి వారు కూడా తమకున్న పలుకుబడితో ఢిల్లీలో పార్టీ పెద్దలను కలసి తమకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిసింది. వీరితో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. కొందరు నేతలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలసి తమ పేరును హైకమాండ్ కు పంపాలంటూ వినతులను అందచేస్తున్నారు.
హైకమాండ్ ఆలోచన...
కానీ హైకమాండ్ ఆలోచన వేరే విధంగా ఉందన్న ప్రచారం జరుగుతుంది. సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ లెవెల్లో ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండటంతో మధ్యేమార్గంగా అభిషేక్ మను సింఘ్వి కి ఆ స్థానం కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా, అందులో ఒకటి రేణుకా చౌదరి, మరొకటి అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు. ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానాన్ని పార్టీ సీనియర్ నేతకు ఇవ్వాలన్న నిర్ణయానికి రావడంతో తెలంగాణ నేతల్లో ఆశలు వమ్ము అయ్యాయి. ఈ పోస్టు కూడా పోయినట్లేనా? అన్న నిరాశలో కొందరు నేతలున్నారు.
Next Story