Sun Mar 16 2025 12:14:19 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : శ్రీశైలం ఎడమ టన్నెల్ వద్దకు కేరళ పోలీసు జాగిలాలు... జాడ దొరికేనా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు పథ్నాలుగు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టినా కార్మికుల జాడ లభించలేదు. 14వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్ చేరినప్పటికీ సానుకూల ఫలితం రాలేదు. పథ్నాలుగు రోజుల క్రితం ఎనిమిది మంది కార్మికులు టన్నెల్ లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక బృందాలు నిరంతరం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే వారు బతికి ఉంటారన్న ఆశ మాత్రం పూర్తిగా అడుగింటింది. కనీసం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించాలన్న ప్రభుత్వ ప్రయత్నమూ సత్ఫలితాలివ్వడం లేదు.
సహాయక చర్యలకు...
అనేక రకాలుగా ఆటంకాలు సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయి. టన్నెల్ లో నీరు ఉబికి వస్తుండటంతో పాటు పేరుకుపోయిన బురద కూడా మృతదేహాల వెలికి తీతకు ఇబ్బందికరంగా మారిందని సహాయక బృందాలు చెబుతున్నాయి. విడతల వారీగా పదకొండు బృందాలు టన్నెల్ లోకి వెళ్లి వస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి తోపాటు అనేక సంస్థలకు చెందిన బృందాలు కార్మికుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ సాధ్యపడకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది.
మినీ ప్రొక్లెయినర్ తో...
మరొక వైపు టీబీఎం మిషన్ ను బయటకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా కష్టతరంగా మారాయి. టీబీఎం మిషన్ శిధిలాలను పూర్తిగా తొలగిస్తేనే తప్ప మృతదేహాల జాడ లభ్యమయ్యే అవకాశం లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఈ ఆపరేషన్ లోకి లోకి కేరళ పోలీసు జాగిలాలను కూడా తీసుకు వచ్చారు. మినీ ప్రొక్లెయినర్ తో అధికారులు తవ్వకాలు చేపట్టారు. జాగిలాల సాయంతో కార్మికుల జాడ కనుగొనాలన్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.
Next Story