Tue Mar 18 2025 17:51:41 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : శ్రీశైలం ప్రమాదంపై లేటెస్ట్ అప్ డేట్ ఇదే
శ్రీశైలం ఎడమకాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

శ్రీశైలం ఎడమకాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేటికి సహాయక చర్యలు ప్రారంభమై 24 రోజులు అవుతుంది. టన్నెల్ లో చిక్కుకుపోయిన ఏడుగురి కార్మికుల మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతుంది. మొత్తం పన్నెండు బృందాలతో పాటు.. మానవ ప్రయత్నానికి తోడు సాంకేతికతను జోడించి సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. టన్నెల్ లో పేరుకుపోయిన బురదను పూర్తి స్థాయిలో తొలగించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభమయినా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి రాలేదు.
మట్టి తవ్వకాలు జరిపేందుకు...
కేరళ జాగిలాలు గుర్తించిన ప్రాంతాల్లోనే మృతదేహాలు ఉంటాయని అధికారులు అంచనా వేవారు. అక్కడ మట్టి తవ్వకాలు జరిపేందుకు రోబోలను తెప్పించి జరుపుతున్నా సకాలంలో సాధ్యపడటం లేదు. మొత్తం 650 మంది వివిధ రకాల సిబ్బంది షిప్ట్ ల వారీగా నిరంతరం పనిచేస్తున్నారు. ఇప్పటికీ టన్నెలో నీరు ఉబికి వస్తుండటంతో కార్మికులు అక్కడకు వెళ్లి తవ్వకాలు జరిపేందుకు సాధ్యం కావడం లేదు. నలభై మీటర్ల వద్ద ప్రమాదకరమైన పరిస్థితులుండటంతో అక్కడ వరకూ వెళ్లేందుకు సాధ్యపడటం లేదు.
మూడు రోబోలను...
మొత్తం మూడు రోబోలు వినియోగిస్తున్నా ఇంకా జాడ తెలియకపోవడంతో సహాయక చర్యలు కొనసాగించాలనే ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు సహాయక చర్యల కోసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. అయినా సరే మృతదేహాలు లభ్యమయితే వారి బంధువులకు అప్పగించాలని ప్రభుత్వం భావించి సహాయక చర్యలను కొనసాగించాలనే నిర్ణయించింది. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి.
Next Story