Sun Mar 16 2025 12:24:11 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : టన్నెల్ లో లేటెస్ట్ అప్ డేట్.. ఈరోజు సాధ్యమవుతుందా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొలిక్కి రాలేదు. గత పది రోజుల నుంచి సహాయక చర్యలు ప్రారంభించినా ఇంత వరకూ లోపల చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం కనిపించడం లేదు. దాదాపు పది రోజుల నుంచి కార్మికులు టన్నెల్ లో చిక్కుకుని జీవించడం అసాధ్యమని ఎన్.డి.ఆర్.ఎఫ్ అధికారులే చెబుతున్నారు. బురద, నీటి ఊటతో వారి జాడ కనుక్కోవడం అసాధ్యంగా మారింది. కనీసం మృతదేహాలైనా దొరుకుతాయా? అన్న అనుమానం ఇప్పుడు సహాయక బృందాల్లో కనపడుతుంది. ఎందుకంటే గత పది రోజుల నుంచి కార్మికుల బంధువులు ఎదురు చూస్తున్నారు.
ప్రమాదకరమైన పరిస్థితులు...
టన్నెల్ లో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొనడం వల్లనే సహాయక చర్యలు నిదానంగా జరుగుతున్నాయి. నీటి ఊట నిరంతరాయంగా వస్తుండటంతో సహాయక బృందాలు 24 గంటలూ శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఏ మాత్రం అలక్ష్యం చేసినా పై కప్పు కూలే అవకాశముందని, తాము కూడా ప్రమాదంలో పడే అవకాశముందని భావించి చాలా జాగ్రత్తగా సహాయక చర్యలు ప్రారంభించారు. పథ్నాలుగు మీటర్ల మేరకు పనులు జరిగినా, ప్రమాదం వద్దకు చేరాలంటే కొద్ది అడుగులోనే అది ఆగిపోతుంది. రెండు రోజుల నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి అయితే వెళ్లగలిగాయి కానీ వారి జాడ మాత్రం తెలియరాలేదు.
పనులు కొనసాగిస్తామన్న...
అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ను పరిశీలించిన అనంతరం ఈరోజు కార్మికుల జాడ తెలిసే అవకాశముందని తెలిపారు. అదే సమయంలో ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనులను కొనసాగిస్తామని చెప్పారు. అత్యాధునిక పరికరాలతో అవసరమైతే రోబోలను ఉపయోగించి, ప్రాణ నష్టం, ఎలాంటి ప్రమాదం లేకుండా పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ పనులు ఆగే అవకాశం లేనట్లు కనిపిస్తుంది. మరోవైపు టన్నెల్ బయట అంబులెన్స్ లను ప్రభుత్వం రెడీ చేసింది. ఫోరెన్సిక్ బృందాలను కూడా సిద్ధం చేసింది. ఎప్పుడైనా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల సమాచారం తెలిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
Next Story