Sun Mar 16 2025 12:14:11 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : ఏ ప్రయత్నం చేసినా ఫలించడం లేదే.. ముగింపు లేదా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం పదకొండు బృందాలతో పాటు కేరళ నుంచి తెప్పించిన శునకాలు, రోబోలు కూడా సహాయక చర్యలలో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. అయినా తప్పిపోయిన ఏడుగురు కార్మికుల జాడ తెలియడం లేదు. ఒక మృతదేహమే లభ్యం కావడంతో మిగిలిన ఏడుగురి మృతదేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ ను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. షిఫ్ట్ ల వారీగా బృందాలు టన్నెల్ లోకి వెళ్లి పరిశీలన చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు.
రోబోలను రంగంలోకి దించినా...
మిగతా వారి ఆచూకీ కోసం రోబోలు రంగంలోకి దిగాయి. హైడ్రాలిక్ పవర్డ్ రోబోను అధికారులు టన్నెల్ లోకి పంపారు. చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండటంతో రోబోలను రెస్క్యూ సిబ్బంది వినియోగించాలని నిర్ణయించారు. రోబో ద్వారా 40 హెచ్పీ పంప్ సాయంతో బయటికి బురద నీటిని తోడుతున్నారు. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. నలభై మీటర్ల వద్ద రెస్క్యూ సిబ్బంది వెళితే రిస్క్ లో పడే అవకాశముందని ఉన్నతాధికారులు రోబోలను వినియోగిస్తూ మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
ఇరవై రోజులవుతున్నా...
ప్రమాదం జరిగి నేటికి ఇరవై రోజు అవుతుంది. అయినా సహాయక బృందాల వల్ల సాధ్యం కావడం లేదంటే లోపల ఎంతటి ఘోరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, భారత సైన్యం వల్ల కూడా కాలేదంటే పరిస్థితి క్లిష్టంగా ఉందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కానీ మృతదేహాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండటంతో నిరంతరం సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశిస్తున్నారు. కార్మికుల బంధువులు కూడా వేచిచూడలేక అక్కడి నుంచి సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరి దీనికి ముగింపు ఎప్పుడో అర్థం కాకుండా ఉంది.
Next Story