Mon Dec 16 2024 13:36:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో కోటి మందికి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వారి చేతుల్లో
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి కానీ, ఫిబ్రవరి నెలలో కానీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిసైడ్ చేసింది. అంతేకాదు ఇకపై రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిశ్చయించింది. ఇక పాత, కొత్త రేషన్ కార్డుదారులకు నిజమైన పండగ అప్పటి నుంచే. ఎందుకంటే ఇప్పటి వరకూ రేషన్ బియ్యం తినలేకపోతున్నామని, వాటిని బయట విక్రయించేందుకు ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు. అదే సమయంలో రేషన్ బియ్యం పక్క దారి కూడా పడుతుంది. అందుకే ఇక ఇప్పుడిస్తున్న రేషన్ బియ్యం స్థానంలో ఇకపై సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించారు.
బయట మార్కెట్ లో...
సన్న బియ్యం బయట మార్కెట్ లో కిలో నలభై రూపాయలకు పైగానే పడుతుంది. అంత సొమ్ము వెచ్చించి బయట మార్కెట్ లో కొనుగోలు చేయడం సామాన్యులకు అసాధ్యమనే చెప్పాలి. అందుకే ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యంతోనే కొందరు కడుపు నింపుకుంటుండగా, మరికొందరు దోసె పిండి కోసం వినియోగించుకుంటున్నారు. ఇంకొందరు రేషన్ బియ్యాన్ని అక్కడిక్కడే విక్రయించి నగదు తీసుకుని బయటపడుతున్నారు. దీంతో రేషన్ బియ్యం వల్ల ప్రయోజనం లేదని, లబ్దిదారులు సంతృప్తి చెందడం లేదని భావించిన ప్రభుత్వం రేషన్ బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. బహుశ కొత్త రేషన్ కార్డులు ఫిబ్రవరి నాటికి మంజూరు చేసి ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది.
అర్హతలు ఇవేనట...
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల తెలుపు రంగు రేషన్ కార్డులున్నాయి. వీటికి అదనంగా మరో పదిహేను లక్షల కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మొత్తంకోటి రేషన్ కార్డులు ఉంటాయన్న మాట. అయితే ఇందుకోసం కొన్ని అర్హతలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల ద్వారా కేవలం సన్నబియ్యం మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలైన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు వంటివి అందించాల్సి రావడంతో కొన్ని అర్హతలను నిర్ణయించారు. సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.50 లక్షల్లోపు, పట్టణాల్లో రెండు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికే తెలుపు రంగు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
Next Story