Sun Dec 22 2024 22:41:39 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వింటే కళ్లు తిరగాల్సిందే?
హైదరాబాద్ లో మూసీ నది వెంట ఉన్న భవనాలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమయింది
హైదరాబాద్ లో మూసీ నది వెంట ఉన్న భవనాలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును ఛాలెంజ్ గా తీసుకున్నారు. సియోల్ తరహాలో హైదరాబాద్ నగరంలో సుందరీకరించి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అంతే కాదు మూసీ నది వెంట ఉన్న దాదాపు పదివేల భవనాలను కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మున్సిపల్, రెవెన్యూ కమిషనర్లు వారికి నోటీసులు ఇచ్చారు. కొందరు బహుళ అంతస్థుల భవనాలు కూడా నిర్మించుకుని ఉండటంతో వాటిని కూడా తొలగించేందుకు సిద్ధపడ్డారు. ఇదే ఆందోళనకు కారణమయింది.
డబుల్ బెడ్ రూంలు...
కానీ అదే సమయంలో ప్రభుత్వం మూసీ పరివాహకం వెంట ఉన్న ప్రజలను ఒప్పించేందుకు సిద్ధపడుతున్నారు. వారిని మెప్పించడానికి సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం రూపొందించినట్లు తెలిసింది. ఇప్పటికే నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించారు. ఈ ఇంటి విలువ దాదాపు ముప్ఫయి లక్షల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. మూసీ నది వెంట ఉంటూ దుర్వాసనను పీల్చుకుంటూ, రోగాలు తెచ్చుకుంటూ ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూంలను కేటాయిస్తున్నారు. ఇవి ప్రైమ్ ఏరియాలోనే ఉండేటట్లు చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఆ ఇంటి విలువ ఇప్పుడు ఉన్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ కనుక వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రావన్నది ప్రభుత్వ అభిప్రాయం.
రెండు వందల గజాలు...
ఇక బహుళ అంతస్థుల భవనాల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎందుకంటే అక్కడ స్థలం విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. వీటి మార్కెట్ విలువను అంచనా వేయడం కష్టం. అందుకే అదే ప్రాంతంలో మూసీ నదికి దూరంగా రెండు వందల చదరపు గజాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పాటు కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందచేయాలని భావిస్తుంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పూర్తయితే అది కమర్షియల్ భవనంగా కూడా మారి మరింత లాభాలను వారికి తెచ్చిపెడుతుందన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఇలా మూసీ నిర్వాసితులను పెద్దగా న్యాయపోరాటం, వీధిపోరాటాలు చేయకుండా మెప్పించడానికి భారీ నజరానాలు త్వరలోనే రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. మరి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు ముందు పెడితే నిర్వాసితులు అందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story