Mon Dec 23 2024 05:07:12 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ పేదలకు రేవంత్ గుడ్ న్యూస్.. త్వరలో ఇళ్ల నిర్మాణం
తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. సంక్రాంతి పండగ నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా తొలుత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎంపిక ప్రక్రియ పూర్తయితే సగం పనులు పూర్తయ్యేనట్లేనని భావిస్తున్నారు. పూర్తి చేసిన లబ్దిదారుల జాబితాను బహిరంగంగా ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. ఈ నెలాఖరు నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించగలిగితే సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణం చేపట్టవచ్చని భావిస్తుంది.
వచ్చే నెల మొదటి వారం నుంచి...
ప్రస్తుతం తెలంగాణలో కులగణన సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఈ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశముంది. ఈ సర్వే పూర్తయి వివరాలను కంప్యూటరీకరించిన తర్వాత పూర్తి వివరాలు ప్రభుత్వం వద్దకు అందుతాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారం నుంచి లబ్ది దారుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టినా సంక్రాంతి నాటికి పూర్తవుతుందని పాలకపక్షం అంచనా వేస్తుంది. నిజానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికే జాప్యం జరిగింది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల తొలి జాబితాను ప్రకటించాలని భావించింది. కానీ కులగణన జరుగుతుండటంతో అనివార్యంగా వాయిదా పడింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మంజూరుపై నిబంధనలు కూడా ఇంకా రూపొందించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు పర్చాలన్న ఉద్దేశ్యంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని భావిస్తుంది.
స్థలం ఉన్న వారికే తొలి విడతగా...
తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారితో పాటు ఇళ్లు లేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. వాస్తవంగా ఇళ్లులేని నిరుపేద లబ్దిదారులను గుర్తించి వారికి శాశ్వత గృహాలను నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం నిధులను జత చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. ఇంటి నిర్మాణానికి నాలుగు దశలో ప్రభుత్వం లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయల వరకూ చెల్లిస్తామని చెప్పింది. అయితే తొలి దశలో మాత్రం ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే పక్కా ఇళ్లు మంజూరు చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. దీంతో తొలి విడత వారికే ఇళ్లు మంజూరు కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్థలం లేని లబ్దిదారులను కూడా ఈ పథకానికి ఎంపిక చేసే విధంగా నిబంధనలను రూపొందించనున్నారు. మొత్తం మీద సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు.
Next Story