Wed Mar 26 2025 16:03:05 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పేదలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్...ప్రతిరోజూ పండగే
ఉగాది రోజున పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది.

ఉగాది రోజున పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 30న హుజూర్ నగర్ మట్టపల్లి లో సీఎం రేవంత్ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఉగాది రోజున పేదల ఇళ్లలో పండగ వాతావరణం నెలకొల్పాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
దొడ్డుబియ్యం స్థానంలో...
ఇప్పటి వరకూ తెలుపు రంగు రేషన్ కార్డులకు దొడ్డుబియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారు. వాటి స్థానంలో నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక ప్రతిరోజూ పండగలా ఉగాది నుంచి జరుపుకోవాలని, ప్రతి పేద వాడి ఇంట్లో సన్న బియ్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారులకు జారీ అయ్యాయి. సన్న బియ్యాన్ని సేకరించి వాటిని పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఐదు వందలు బోనస్ ఇచ్చి...
ఇందుకోసం రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఇరవై నాలుగు లక్షల టన్నుల సన్నబియ్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. అధికారులు ఇదే పనిలో ఉన్నారు. ఉగాదికి ఇంకా వారం రోజుల మాత్రమే సమయం ఉండటంతో సన్న బియ్యం సేకరణ కార్యక్రమాన్ని వేగంగా చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు అమ్ముడుపోతున్న దొడ్డుబియ్యం స్థానంలో నేరుగా వినియోగించగల సన్నబియ్యాన్ని అందించనుంది. యాసంగిలో వచ్చే ధాన్యాన్ని సేకరించి రేషన్ కార్డుదారులకు అందించనున్నారు.
Next Story