Mon Dec 23 2024 11:29:16 GMT+0000 (Coordinated Universal Time)
ఉచిత విద్యుత్ అక్కర్లేదన్న రేవంత్ : కేటీఆర్ ను తొందరపడొద్దన్న కోమటిరెడ్డి
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే అంశం పూర్తిగా రేవంత్ ఇష్టం కాదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి అన్నారు. అతను చెబితే..
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 8 గంటలు మాత్రమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుందని, అలాంటపుడు నిరంతర ఉచిత విద్యుత్ ఎందుకు ? అని అర్థం వచ్చేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ రైతుల కోసం చేపట్టిన పథకాలను కొనసాగిస్తారా ? అని అమెరికాలో ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు రేవంత్ ఇచ్చిన సమాధానాలు వివాదానికి దారితీశాయి. ఉచిత కరెంట్ పేరుతో బీఆర్ఎస్ ప్రజలను మభ్యపెడుతుంది అంటూనే.. కాంగ్రెస్ వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వబోమనడంతో.. రేవంత్ వ్యాఖ్యలపై తెలంగామ ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. రైతు వ్యతిరేక విధి విధానాలను కాంగ్రెస్ బయటపెట్టిందన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ రైతాంగం, ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని మరోసారి గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే అంశం పూర్తిగా రేవంత్ ఇష్టం కాదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి అన్నారు. అతను చెబితే అంతా ఫైనల్ అయిపోదని, పార్టీకి ఒక సిద్ధాంతం ఉందన్నారు. రేవంత్, తాను పార్టీ కో ఆర్డినేటర్లు మాత్రమేనని, రైతులకోసం ఏం చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామన్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటిపై కేటీఆర్ తొందరపడి మాట్లాడొద్దని కోమటిరెడ్డి కోరారు. రేవంత్ ఉచిత విద్యుత్ పై అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అడిగి తెలుసుకుంటానన్నారు. తానే కాంగ్రెస్ కు అన్నీ అన్నట్టు రేవంత్ మాట్లాడి ఉంటే.. అది ముమ్మాటికీ తప్పే అవుతుందన్నారు. ఏదేమైనా కర్ణాటకలో గెలుపుతో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ తెలంగాణలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయమై చేసిన వ్యాఖ్యలు టి-కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టించాయి.
Next Story