Mon Dec 23 2024 15:37:42 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కేసీఆర్వి వన్నీ పచ్చి అబద్దాలు.. కోటి ఎకరాలు ఉత్తుత్తిదే
కాళేశ్వరం నిర్మాణంతో 19 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తాయని, కోటి ఎకరాలకు నీళ్లన్నది అబద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 19 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు వస్తాయని, కోటి ఎకరాలకు నీళ్లన్నది అబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన అధికారులతో ఆయన మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాలతో కోటి ఎకరాలకు మాగాణిని చేస్తామని అబద్ధాలు చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేవలం విద్యుత్తు బిల్లులే ఏడాదికి పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారన్నది అబద్ధమని చెప్పారు. ఏటా బ్యాంకు రుణాలు, వడ్డీ చెల్లింపులకే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందన్నారు.
రెండు లక్షల కోట్లు ఖర్చు చేసి...
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఎక్కడా చుక్క నీరు లేదని ఆయన అన్నారు. ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 2020లోనే ఈ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు చెప్పారన్నారు. నీళ్లు నింపితే కాని భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదని రేవంత్ రెడ్డి అన్నారు. అబద్ధపు ప్రచారాలతో ఇప్పటి వరకూ కేసీఆర్ కాం వెళ్లబుచ్చారన్న రేవంత్ రెడ్డి 94 వేల కోట్లు ఖర్చు చేసి 98,500 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని ఆయన తెలిపారు. 2019లో ప్రాజెక్టు పూర్తయితే 2020 నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని రేవంత్ రెడ్డి తెలిపారు. కేవలం తమ ప్రయోజనాల కోసమే ఈ బ్యారేజీని నిర్మించినట్లుందన్నారు.
తమకు సంబంధం లేదంటూ...
తాము ఓడిపోయామని తమకు సంబంధం లేదని కేసీఆర్ అంటున్నారని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని తమకు ఏం సంబంధమని ఎల్అండ్్టీ ప్రశ్నిస్తుందన్నారు. మూడు బ్యారేజీలలో నీళ్లు లేవని అన్నారు. ప్రాజెక్టుకు ఇబ్బందులున్నాయని అధికారులు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 2021 మార్చిలో ప్రాజెక్టు పూర్తయినట్లు అధికారులు లేఖలు ఇచ్చారని, తర్వాత సమస్యలు తలెత్తినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారన్న రేవంత్ రెడ్డి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారన్నారు. అప్పులు చేసి మరీ ప్రాజెక్టును నిర్మించి సొంతంగా లాభపడ్డారని అన్నారు.
Next Story