Mon Apr 21 2025 10:13:28 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంతే ఎందుకు?.. హైకమాండ్ అంత నమ్మడానికి రీజన్ ఏంటంటే?
కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఒక్కరోజులోనే కాంగ్రెస్ హైకమాండ్ తేల్చేసింది

కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఒక్కరోజులోనే కాంగ్రెస్ హైకమాండ్ తేల్చేసింది. ఇది సీఎల్పీ అభిప్రాయం అని పైకి చెబుతున్నా.. శంఖంలో పోసిన తర్వాతే తీర్థమన్నట్లు చూడాలి కాని రాహుల్ మనసులో రేవంత్ బలమైన నేతగా గుర్తింపు పొందారు. అందుకే ఎన్ని అభ్యంతరాలు వచ్చినా... ఎన్ని సాకులు చెప్పినా సరే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. పార్టీ నాయకత్వం అంటే రాహుల్ మనసులో ఏముందో ముందే డీకే శివకుమార్ కు తెలిసి పోతుంది. ఆయన సూచనలకు అనుగుణంగానే ఇక్కడ అభిప్రాయ సేకరణ కూడా జరుగుతుంది. అయితే రేవంత్ ను ఎంపిక చేయడానికి గల కారణాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి.
అధికారంలోకి రావడానికి...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డితో పాటు మిగిలన నేతలు కూడా కారణమయినా.. ఎక్కువగా రేవంత్ పాత్ర ఉందన్నదే పార్టీ హైకమాండ్ నమ్మింది. ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన స్థానాలు చూసిన తర్వాత కూడా అనవసర ప్రయోగాలు చేయడం వేస్ట్ అని భావించింది. రేవంత్ రెడ్డిని కాదని మరొక నేతను సీఎంగా ప్రకటిస్తే ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకునే సత్తా, శక్తి సామర్థ్యాలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. రేవంత్ అందరినీ తన వెంట నడుపుకుని నడుస్తారన్న నమ్మకం కూడా బాగా కుదరింది. ఇతర నేతలకు సీఎం పదవి ఇస్తే లేనిపోని తలనొప్పులు తెచ్చుకుని ప్రత్యర్థికి అవకాశమివ్వడం ఎందుకన్న భావన కూడా హైకమాండ్ లో కలిగింది.
ప్లస్‌లు ఎక్కువ...
రేవంత్ రెడ్డి అయితే పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలడన్న విశ్వాసంతోనే ఆయనకు ఈ పదవిని కట్టబెట్టింది. ఇక్కడ నమ్మకం.. విశ్వాసం.. విధేయత వంటివి ట్రాష్ లుగా హైకమాండ్ భావించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణలోనే కాంగ్రెస్ విజయం సాధించింది. అలాంటి తెలంగాణలోనూ అనవసర నిర్ణయాలు తీసుకుని అధికారాన్ని చేజార్చుకోకూడదని కూడా భావించి ఉండవచ్చు. రేవంత్ ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కొద్ది నెలల్లోనే సీఎం పదవి ఇచ్చామనడం తప్ప ఆయనను వ్యతిరేకించే వారి వద్ద బలమైన కారణాలు మరేవీ లేకపోవడం కూడా హైకమాండ్ గమనించింది. ఎక్కువ కారణాలు రేవంత్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం వెలువడిందని చెప్పొచ్చు.
Next Story