ఏం ప్లాన్‌రా బాబు.. పుష్ప సినిమాను మించిన హైటెక్ స్మగ్లింగ్
ఏం ఐడియారా బాబు.. చేసే పని దొంగ పని అయినా హైటెక్‌గా చేసేస్తున్నారు చాలా మంది. ఎవ్వరికి అనుమానం రాకుండా కొత్త మార్గాలను..
ఏం ఐడియారా బాబు.. చేసే పని దొంగ పని అయినా హైటెక్‌గా చేసేస్తున్నారు చాలా మంది. ఎవ్వరికి అనుమానం రాకుండా కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక పుష్ప సినిమా తలపించే విధంగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా హైటెక్ స్మగ్లర్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.. వారి ప్లాన్ చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులలో ఇద్దరిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 75 లక్షల విలువ చేసే 300 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కోలి రాజా వర్మ, మహారాష్ట్రకు చెందిన పార్టిల్ నామ్‌దేవ్ ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. రాహుల్ సబులే, శుభం గోతీరామ్ సబులే, శేషుకుమార్ అనే మరో ముగ్గురు ప్రస్తుతం పరారిలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో 300 కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేశారు. ఈ గంజాయిని రెండుకిలోల ప్యాకెట్ల రూపంలో తయారు చేసి పోలీసులకు చిక్కకుండా మాస్టర్ ప్లాన్ వేశారు. గంజాయి రవాణా కు వినియోగిస్తున్న డిసియం వ్యాన్ పై కప్పును సపరేట్ గా డిజైన్ చేసుకున్నారు. పైకప్పు పైన మరో లేయర్ ఏర్పాటు చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా అందులో గంజాయి ప్యాకెట్లను నింపేశారు. ఇంటి పై కప్పు మీద పెంకులు అమర్చినట్లుగా గంజాయి ప్యాకెట్లను అమర్చి వాటి మీద తాడిపత్రితో మూసివేసి ఈ గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
ఇలా గంజాయితో సుమారు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. ఎన్నో పోలీసు చెక్ పోస్టులు తప్పించుకుని వచ్చిన ముఠా ఎట్టకేలకు వరంగల్ పోలీసులకు చిక్కారు. అయితే పక్కా సమాచారం మేరకు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిపోయారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్‌పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఈ గంజాయాని పట్టుకున్నారు పోలీసులు. గంజాయి స్మిగ్లింగ్ కోసం ఏర్పాటు చేసిన డీసీఎంను చూసి పోలీసులే షాక్ అయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.