Fri Apr 04 2025 07:15:28 GMT+0000 (Coordinated Universal Time)
Raithu Barosa : రైతు భరోసా నిధులు అందరికీ చేరుతున్నాయా? ఎందుకు రాలేదో మీకు తెలుసా?
రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించింది

రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతగా ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఇందుకోసం ఏడు వేల కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించడంతో అందరికీసాయం అందుతుందని భావించారు. సాగవుతున్న అన్ని భూములకు రైతు భరోసా నిధులను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సాగుకు అనువైన భూములను గుర్తించి ఈ మేరకు లబ్దిదారుల జాబితాను తయారు చేశారు.
ఎకరం ఉన్న వారికి...
అయితే విడతల వారీగా ఒక్కొక్కరి ఖాతాలో రైతు భరోసా నిధులు పడుతున్నాయి. ఎకరం నుంచి మొదలు పెట్టిన రైతుకు వరసగా ఐదు ఎకరాలు, తర్వాత పది ఎకరాలు, ఆ తర్వాత అంతకు మించి ఎకరాలున్న వారికి ప్రాధాన్యత క్రమంలో ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులోనూ సాగవుతున్న భూములకు ముందు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సాగు చేయని, అయితే సాగుకు అనుకూలంగా ఉన్న భూములకు తర్వాత నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి నెల వరకూ ఈనిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతూనే ఉంటాయని ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని అధికారులు హామీ ఇస్తున్నారు.
విడతల వారీగా...
విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండటంతో ఒక గ్రామంలో కొందరికి రైతుభరోసా నిధులు రావడం, మరికొందరికి రాకపోవడంతో వెంటనే కార్యాలయాలకు వచ్చి అధికారులను సంప్రదిస్తున్నారు. కొందరైతే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అయితే గతంలో ఇచ్చిన దానికంటే రైతుల సంఖ్య తగ్గిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన వారికంటే 3.94 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదని అంటున్నారు. వీరంతా ఎకరం లోపు ఉన్న వారేనని వారికి ఎందుకు పడలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 19 లక్షల మంది ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు అధికారుల తెలిపారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని చెబుతున్నారు. అందుకు ఓపిక పట్టి వేచిచూసి అప్పుడు ఫిర్యాదు చేయవచ్చని, అర్హులైన వారందరికీ రైతు భరోసా ఇస్తామని అధికారులు అంటున్నారు. కానీ రైతుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story