Sun Mar 16 2025 12:44:02 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : మృతదేహాలు బయటపడాలంటే అదే మార్గమా? తవ్వకాలు షురూ
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో కార్మికుల జాడ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో కార్మికుల జాడ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 13. 5 కిలోమీటర్ల వరకూ సహాయక బృందాలు వెళ్లగలిగాయి. అయితే పథ్నాలుగో కిలోమీటర్ల వద్ద మాత్రమే కార్మికుల జాడ ఉంటుందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. కేరళ నుంచి శునకాలను రప్పించినా అవి కొన్నిచోట్ల కార్మికుల మృతదేహాలను గుర్తించాయని తొలుత చెప్పినా అక్కడ తవ్వకాలు కష్టంగా మారింది. ఎనిమిది మీటర్లు తవ్వినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పాటు ఈ అర కిలోమీటర్ దూరం హై రిస్క్ లో ఉందని సహాయక బృందాలు చెబుతున్నాయి. రెస్క్యూ సిబ్బందికి రిస్క్ గా మారే అవకాశముందని భావిస్తున్నారు. అయితే మృతదేహాల జాడ తెలిసిందంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మృతదేహాల ఆనవాళ్లు లభించడంతో అక్కడ నేడు తవ్వకాలు జరుపుతున్నారు.
సహాయక బృందాల వల్ల కూడా...
ఇక మృతదేహాలను వెలికితీయడం సహాయక బృందాల వల్ల కాదని దాదాపుగా నిర్ధారణ అయింది. ఉన్నతాధికారులు కూడా అదే తేల్చారు. ఇప్పటికే పదకొండు శాఖలకు చెందిన బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఏ మాత్రం ప్రయోజనం లేదు. రిస్క్ తీసుకుని వెళ్లినా కార్మికుల మృతదేహాల జాడ లభించే అవకాశాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఇప్పటికే పదహారో రోజుకు సహాయక చర్యలు చేరుకోవడంతో బృందాలు కూడా ఆపరేషన్ సక్సెస్ చేయలేకపోతున్నాయని అధికారులు ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చారు. టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇక రోబోలను వినియోగించడం మినహా మరో మార్గం లేదని డిసైడ్ అయ్యారు.
ఈ నెల 11వ తేదీన...
నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల 11వ తేదీన మళ్లీ ఇక్కడకు వస్తామని తెలిపారు. అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదంపై సమీక్ష జరుపుతామని చెప్పడంతో ఆరోజు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముందని తెలిసింది. పదహారు రోజులు గడుస్తున్నా కార్మికుల జాడ తెలియకపోవడంతో బంధువులతో పాటు అధికారులు కూడా ఆశలు వదులుకున్నారు. బహుశ ఈ నెల 11వ తేదీన ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశముందని తెలిసింది. అదే రోజు కార్మికుల కుటుంబాలకు పరిహారం ప్రకటించి, అనంతరం పనులను ప్రారంభించాలన్న యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
Next Story