ఈమని శివనాగిరెడ్డి: ఎల్లికల్లులో 400 ఏళ్ల నాటి సూక్ష్మ ఆంజనేయ విగ్రహం
400 ఏళ్ల ప్రాచీన సూక్ష్మ ఆంజనేయ విగ్రహం కల్వకుర్తి సమీపం లో కనిపించిందని శివనాగిరెడ్డి తెలిపారు.
కల్వకుర్తి, నవంబర్ 6మండల కేంద్రమైన కల్వకుర్తికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లికలు గ్రామంలోని శివాలయంలో 400 ఏళ్ల నాటి అరుదైన అతి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన బుధవారం నాడు గ్రామ శివారులోని శిథిల శివాలయాన్ని, అందులో ఉన్న భిన్నమైన మూడు నంది విగ్రహాలను, కప్పు రాలి పగిలిపోయిన మండపం, నిధుల వేటగాళ్ల గడ్డపారులకు బలైన గర్భాలయం ను పరిశీలించారు. చుట్టూ ప్రాకారంతో ఉన్న శిధిల శివాలయాలను పదిలపరిచి, నంది శిల్పాలను గ్రామంలో పీఠాలపై నిలబెట్టి కాపాడుకోవాలని శివ నాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం గ్రామంలోని శివాలయం ధ్వజస్తంభం పీఠం పైన 6 అంగుళాల ఎత్తు నాలుగు అంగుళాల వెడల్పు రెండు అంగుళాల మందంగల సున్నపురాతితో చెక్కిన సూక్ష్మ ఆంజనేయ విగ్రహం, అదే కొలతలతో గణేష్ విగ్రహం ఉన్నాయని, విజయనగర కాలానికి చెందిన 400 ఏళ్ల నాటి చారిత్రక ప్రాధాన్యత గల ఈ అరుదైన చిన్న శిల్పాలను కాపాడుకొని, భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల ముత్యాల రెడ్డి, బడే సాయికిరణ్ రెడ్డి పాల్గొన్నారు అని ఆయన చెప్పారు.