Sun Dec 22 2024 22:45:53 GMT+0000 (Coordinated Universal Time)
అలా ఆర్టీసీ బస్సును కొట్టేశాడు.. కానీ ఏమి చేశాడంటే?
తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట ఆర్టీసీ డిపో పరిధిలో ఓ బస్సును ఆగంతకుడు
తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట ఆర్టీసీ డిపో పరిధిలో ఓ బస్సును ఆగంతకుడు దొంగలించాడు. ఆర్టీసీకి నడుపుతున్న అద్దె బస్సు అది. బస్సు ఓనర్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం ఆ బస్సును గత కొంతకాలంగా సిద్దిపేట ఆర్టీసీ డిపోలో అద్దె బస్సుగా నడుపుతున్నారు. రోజువారి మాదిరిగానే ట్రిప్పులు ముగియడంతో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బస్సును సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద పార్కు చేసి డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 6 గంటలకు వచ్చి చూసేసరికి అక్కడ బస్సు కనిపించలేదు. సిరిసిల్లకు చెందిన ఆర్టీసీ సిబ్బంది బస్సు ఓనర్‌కు ఫోన్ చేసి మీ బస్సు జిల్లెల్ల క్రాసింగ్ వద్ద ఉందని చెప్పగా ఓనర్ అక్కడికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది.
దొంగలించిన వ్యక్తి.. బస్సును ఎక్కడికైనా తీసుకుని వెళ్లి అమ్మేయడమో.. లేక స్క్రాప్ కింద పంపించేయడమో చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా సిద్దిపేట నుండి వేములవాడ బస్టాండులో నిలిపాడు. అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుని సిరిసిల్ల బస్ స్టాప్‌లో డ్రాప్ చేశాడు. ప్రయాణీకుల నుండి టికెట్ డబ్బులను తీసుకున్నాడు. ఇక ఇంకో ట్రిప్ వేసి డబ్బులు సంపాదించుకోవాలని అనుకున్నాడు. అక్కడ ప్రయాణీకులను ఎక్కించుకొని సిద్ధిపేటకు వస్తుండగా మార్గమధ్యమంలో డీజిల్ అయిపోవడంతో బస్సును వదిలిపోయాడు. విషయం తెలుసుకున్న ఓనర్ బస్సు దగ్గరకు వచ్చాడు. బస్సును దొంగలించిన వ్యక్తి ఎక్కడికైనా తీసుకుని వెళ్లి అమ్మేశాడేమోనని టెన్షన్ పడ్డ ఓనర్.. ఆ తర్వాత బస్సుతో ట్రిప్పులను నడపడంతో కాస్త షాక్ అయ్యాడు. అతడు బస్సును వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్లి అమ్మేయకుండా ట్రిప్పులు తో డబ్బు సంపాదించుకోవాలని అనుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. దీనిపై బస్సు ఓనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు.
Next Story