Mon Dec 23 2024 08:40:28 GMT+0000 (Coordinated Universal Time)
విద్యుత్ సరఫరా నిలిచిపోయిందా.. ఈ నంబర్లను సంప్రదించండి !
విద్యుత్ అంతరాయంపై దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో..
హైదరాబాద్ : బుధవారం తెల్లవారుజాము నుంచి భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షం ఊహించని బీభత్సాన్ని సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరగ్గా.. విద్యుత్ తీగలు తెగి.. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు డ్రైనేజీల్లోకి వెళ్లే దారిలేక రోడ్లన్నీ జలమయమయ్యాయి. తలాబ్ కట్ట తెగడంతో.. డ్రైనేజ్ వాటర్ ఇళ్లలోకి చేరింది. పాతబస్తీలో వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యరాశి భారీ వర్షానికి తడిచిపోయింది. కొన్ని చోట్ల ధాన్యం వర్షపునీటికి కొట్టుకుపోయింది. అకాల భారీ వర్షం.. రైతుల కళ్లల్లో కన్నీటికి కారణమైంది.
విద్యుత్ అంతరాయంపై దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో విద్యుత్ సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని రఘుమారెడ్డి చెప్పారు. అత్యవసర పరిస్థితులుంటే 1912 లేదా 100 లేదా స్థానిక ఫ్యూజ్ కాల్ ఆఫీస్ కు ఫోన్ చేయవచ్చని చెప్పారు. వాటితో పాటు 7382072104, 7382072106, 7382071574 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చన్నారు. చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు తెగిపడితే వాటిని ముట్టుకోవద్దని సూచించారు. రోడ్ల మీద నిలిచిన నీటిలో కరెంట్ తీగలుగానీ, కరెంట్ పరికరాలుగానీ మునిగితే ఆ ప్రాంతం నుంచి వెళ్లవద్దని రఘుమా తెలిపారు.
Next Story