Thu Mar 27 2025 11:42:20 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలోకి నైరుతి.. ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
నైరుతి ప్రభావంతో ఇప్పటికే ఏపీలో వర్షాలు మొదలయ్యాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం వరకూ రుతుపవనాలు విస్తరించాయని, పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉమ్మడి ఖమ్మం, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరో మూడు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.
నైరుతి ప్రభావంతో ఇప్పటికే ఏపీలో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రాకతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్ తొలివారంలోనే రావాల్సిన నైరుతి.. ఆఖరివారానికి రాష్ట్రమంతా విస్తరించింది. ఇక వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గినట్టేనని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రాకతో ప్రజలకు ఎండనుంచి, ఉక్కపోతల నుంచి ఉపశమనం లభించింది.
Next Story