Tue Apr 22 2025 11:32:23 GMT+0000 (Coordinated Universal Time)
Telanagna : నేడు హోలీ సందర్భంగా ఆ గ్రామంలో పిడిగుద్దులాట
నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని హున్నా గ్రామంలో ఈ వింత ఆచారం అమలులో ఉంది

నేడు దేశ వ్యాప్తంగా హోలీ జరుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం వింత ఆచారం ప్రజలు జరుపుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తున్నదైనా పోలీసులు దీనిపై ఆంక్షలు విధించారు. గ్రామస్థులందరూ ఒకచోట చేరి ముష్టి ఘాతాలకు పాల్పడతారు. పిడిగుద్దులతో కొట్టుకుంటారు. అది తమ సంస్కృతి సంప్రదాయమని గ్రామస్థులు చెబుతున్నా పోలీసులు మాత్రం గ్రామ పెద్దలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని హున్నా గ్రామంలో ఈ వింత ఆచారం అమలులో ఉంది. దీనిని గ్రామ ప్రజలు ఆటగా భావిస్తారు. ప్రతి ఏడాది వచ్చే హోలీ పండగ నాడు దీనిని గ్రామస్థులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
గ్రామ శ్రేయస్సు కోసం...
అయితే తమ గ్రామ శ్రేయస్సు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఈ పిడుగుద్దులాట ఆడతామని గ్రామస్థులు చెబుతున్నారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయమని దీనిని అడ్డుకోవద్దంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అరిష్టం ఏడాది మొత్తం జరగకుండా ఉండాలంటే పిడుగుద్దులాట తప్పదని వారు అంటున్నారు. ఒకవేళ ఏదైనా కారణంతో పిడుగుద్దులాట జరగకపోతే ఆ ఏడాది గ్రామంలో అరిష్టం జరిగిన ఘటనలను గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు. అందుకే తాము ఆడి తీరతామని ప్రజలు చెబుతున్నారు.
గాయపడినా...
పిడుగుద్దులాట సందర్భంగా అనేక మంది గాయపడతారు. అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో గాయాలు కూడా వీరిని బాధించవు. అయితే మగవారు మాత్రమే ఈ పిడుగుద్దులాటలో పాల్గొంటారు. ఓసారి ఈ కార్యక్రమం నిర్వహించని కారణంగా గ్రామంలోని తమ నీటి ట్యాంకర్ కూలిందని కూడా గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. తమ ఆచార సంప్రదాయాలను వదిలిపెట్లేది లేదని, పోలీసులు ఆంక్షలు తమను నిలువరించలేవని కూడా చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. పోలీసుల అనుమతి లేదని, పిడుగుద్దులాట జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పెద్దలకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.
Next Story