Mon Dec 23 2024 14:34:02 GMT+0000 (Coordinated Universal Time)
చికెన్ కర్రీలో పురుగు.. రోడ్డెక్కిన ఓయూ విద్యార్థినులు
హాస్టల్ మెస్ లో భోజనం ఇలాగే ఉంటుంది. తింటే తిను.. లేకపోతే లేదన్నట్లు వ్యవహరించడంతో.. హాస్టల్ విద్యార్థినులంతా..
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ మహిళా వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కి.. ఆందోళన చేశారు. ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైమ్ లో హాస్టల్ మెస్ లో భోజనం చేస్తున్న విద్యార్థినికి చికెన్ కర్రీలో పురుగు వచ్చింది. అది చూసిన ఆమె.. మెస్ సిబ్బందిని ఇదేంటని నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. హాస్టల్ మెస్ లో భోజనం ఇలాగే ఉంటుంది. తింటే తిను.. లేకపోతే లేదన్నట్లు వ్యవహరించడంతో.. హాస్టల్ విద్యార్థినులంతా కలిసి రోడ్డుపై బైఠాయించారు.
ఉన్నత చదువుల కోసం యూనివర్శిటీకి వచ్చిన తమకు.. కనీసం టాయిలెట్స్ కూడా సరిగా లేవని, మంచినీరు, నాణ్యమైన ఆహారం కూడా అందించడం లేదని వాపోయారు. ఆడపిల్లలమైన తమకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోతే.. హాస్టల్ లో ఉండి ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు.. నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆందోళన కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించిన విద్యార్థినుల ఆందోళన విరమించారు.
Next Story