Mon Dec 23 2024 16:00:43 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసిన ఐపీఎస్ అధికారి.. అనుబంధం ఏమిటంటే..!
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను బుధవారం రాజ్‌భవన్‌లో ఓ గెస్ట్ ఆశ్చర్యపరిచారు.
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను బుధవారం రాజ్‌భవన్‌లో ఓ గెస్ట్ ఆశ్చర్యపరిచారు. ఆయన మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్డు భద్రత అదనపు డీజీపీ కృపానంద్ త్రిపాఠి ఉజేలా. జూలై 22 రాత్రి వారణాసి నుండి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణించే సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో విమానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఉన్నారు. వైద్యురాలైన తమిళిసై సౌందరరాజన్ వెంటనే ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చి తేరుకునేలా చేశారు. తాజాగా డీజీపీ కృపానంద్ త్రిపాఠి ఉజేలా గవర్నర్‌ను కలుసుకున్నారు. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ విమానంలో అందించిన వైద్య సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐపీఎస్ అధికారి పర్యటనపై ఆశ్చర్యపోయిన గవర్నర్, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆనాడు విమానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన సహాయం:
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జులై 23, ఉదయం 4 గంటల సమయంలో ఆమె ప్రయాణిస్తున్న విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తికి అత్యవసర చికిత్స అందించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వారణాసి వెళ్లిన గవర్నర్ ఢిల్లీ- హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌లో తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ సమయంలో తోటి ప్రయాణికుల్లో ఒకరు ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్లున్నారా? అని అడిగారు. దీంతో తమిళిసై వెంటనే స్పందించారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న వ్యక్తికి అత్యవసర చికిత్స అందించారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఈ సందర్భంగా సదరు బాధితుడితో పాటు తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది తెలంగాణ గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ కు విమానం చేరుకోగానే సదరు వ్యక్తిని వీల్ చైర్ లో ఆసుపత్రికి తరలించారు. ఆయనే ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్డు భద్రత అదనపు డీజీపీ కృపానంద్ త్రిపాఠి ఉజేలా..! ఇప్పుడు గవర్నర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటన అనంతరం 'విమానంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా విమాన ప్రయాణాల్లో డాక్టర్లు ఎవరైనా ఉంటే ముందే వారి వివరాలను అందుబాటులో ఉంచేలా ఒక కొత్త విధానం ఉండాలి. అదేవిధంగా విమాన సిబ్బందికి సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా ట్రైనింగ్ ఇవ్వాలి. వారితో పాటు సామాన్యులు కూడా సీపీఆర్‌పై అవగాహన పెంచుకుంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది' అని గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు.
రాజకీయాల్లోకి రాకముందు.. తమిళి సై వైద్య విద్యను అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆతర్వాత డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ విశ్వవిద్యాలయం నుంచి ప్రసూతి, గైనకాలజీ విభాగాల్లో పట్టా పొందారు. కెనడా వెళ్లి సోనాలజీ, FET థెరపీలో శిక్షణ తీసుకున్నారు. ఇక ఆమె భర్త సౌందరరాజన్ తమిళనాడులో ప్రముఖ వైద్యుడు.
Next Story