Sun Dec 22 2024 13:19:46 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబూ ఏం చేసినా.. ఇక్కడ కుదరదయ్యా.. నిన్ను నమ్మరయ్యా సామీ?
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో పార్టీ గుర్తుకు వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో పార్టీ గుర్తుకు వస్తుంది. ఏపీలో అధికారంలో లేకపోతే ఇక్కడ పార్టీని అస్సలు పట్టించుకోను కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబుకు ముఖ్యం. తెలంగాణలో పార్టీ అంటే ఆరోవేలు వంటిది. 2023 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రాగానే తెలంగాణ పార్టీ గుర్తుకు వచ్చిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే తెలంగాణలో ఎన్ని కసరత్తులు చేసినా తెలుగుదేశం పార్టీ ఇక కోలుకోవడం కష్టమేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
విడిపోయిన తర్వాత...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వైసీపీ కూడా తెలంగాణకు దూరమయింది. ఇక్కడ ఆ పార్టీని అస్సలు పూర్తిగా తీసివేశారు ఆ పార్టీ అధినేత జగన్. అయితే జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఏదో కొన్ని స్థానాల్లోనైనా గెలిచేందుకు తెలంగాణాలో నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ టీడీపీ కనిపించకుండా పోవడమే తప్ప అస్సలు ఏమాత్రం పార్టీ ఆశాజనకంగా లేదు. ఉన్న నేతలందరూ పార్టీని వీడివెళ్లిపోయారు. టీడీపీ స్థాపించిన నాడు ఉన్న క్యాడర్ మొత్తం ఇతర పార్టీలకు వెళ్లిపోయింది. ఇప్పుడు చూద్దామన్నా తెలంగాణలో టీడీపీకి నేత దొరకడం కష్టమే.
సెంటిమెంట్ పెరిగి...
దొరికినా ఎవరో ఒకరిని తెచ్చి బొమ్మలాగా పెట్టడం మినహా ఇక్కడ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి వచ్చిన చంద్రబాబుకు భారీ స్వాగతం లభించింది. హోర్డింగ్ లు, కటౌట్లు పెద్దయెత్తున వెలిశాయి. దీంతో తెలంగాణ ప్రజల్లో ఒకరకమైన భావం ఏర్పడింది. మరోసారి చంద్రబాబు ఇక్కడ కాలుమోపడానికి వస్తున్నారని సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టులు పెట్టారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారడంతో వెంటనే హోర్డింగ్ లను, ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ తొలగించింది. చంద్రబాబు ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తే మళ్లీ సెంటిమెంట్ రగులుకునే అవకాశాలున్నాయని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబును తెలంగాణ నాయకుడిగా ప్రజలు చూడరు. ఏపీ నేతగానే చూస్తారు. ఇప్పటికీ బీఆర్ఎస్ రాజకీయంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో చంద్రబాబు చంద్రశేఖర్ రావుకు చేయందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతుంది
ఎవరికి లాభం?
ఇది ఒక రకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంచి చేసినట్లేనని అంటున్నారు. కేసీఆర్ కోరుకుంటున్నట్లుగానే చంద్రబాబు ఇక్కడకు వచ్చి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగితే తమకు మంచిదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే తమకు ఇప్పటికీ పది శాతం తెలంగాణలో ఓట్లు ఉన్నాయని టీడీపీ అంచనా వేస్తుంది. కొన్ని స్థానాల్లోనై స్థానిక సంస్థల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తుంది. అందుకే నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమంతో పాటు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ వంటి వాటిపై చర్చిస్తారని తెలిసింది. తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడి పేరును కూడా చంద్రబాబు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మరి ఇంత చేసినా అది కేసీఆర్ కే పరోక్షంగా చంద్రబాబు ప్రయోజనం చేకూర్చేందుకు ఇక్కడ మళ్లీ అడుగుపెడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story