Fri Nov 22 2024 14:06:36 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ అప్పు అంత ఉందా?
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 6,71,757 కోట్ల అప్పులో ఉందని
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం రూ. 6,71,757 కోట్ల అప్పులో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆయన రిలీజ్ చేశారు. బుధవారం నాడు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. 2014-15లో రాష్ట్రం మొత్తం అప్పు రూ.72,658 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.6,71,757 కోట్లకు పెరిగిందని శ్వేతపత్రం వెల్లడించింది. గత 10 సంవత్సరాలలో భారీగా అప్పులు చేశారని అధికారులు తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు ఉండేదని.. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో 100 రోజుల ఖర్చులకు సరిపడా సొమ్ము ఉండేదని భట్టి వివరించారు. ప్రస్తుతం ఇది పది రోజులకు తగ్గిపోయిందని, గత ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాలే దీనికి కారణమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, రోజు ఖర్చులకూ రిజర్వ్ బ్యాంక్ పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి 20 శాతం తేడా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెటేతర ఖర్చు విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలలో సరిపడా నిధులను ఖర్చు చేయలేదని చెప్పారు. ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని వివరించారు. 2014లో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి బడ్జెటేతర రుణాలే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాలపై తెలంగాణ రాష్ట్రం తగినంత నిధులు వెచ్చించలేకపోయిందని, బడ్జెట్లో మొత్తం వ్యయం నిష్పత్తి ప్రకారం దేశంలోనే అత్యల్పంగా ఉందని ఉపముఖ్యమంత్రి అన్నారు.
Next Story