రెండు లక్షల ఏఐ ఇంజినీర్ల తయారీ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం......
ఏఐ ఇంజినీర్ల తయారీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్లోబల్ హబ్‌గా లక్ష్యం.

తెలంగాణ: రాష్ట్రం నుంచి రెండున్నర లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజినీర్లను తయారుచేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణను ఇమర్జింగ్ టెక్నాలజీలకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సజ్జం చేసి, ఏఐ రంగంలో ఉపాధి అవకాశాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రపంచ స్థాయి ఏఐ యూనివర్సిటీ స్థాపన జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చాయని చెప్పారు. హైదరాబాద్‌ను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCCs) కు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గత ఏడాదిలో 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని వివరించారు.
పారిశ్రామిక అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో విస్తరించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని, దీనిపై స్థానిక పారిశ్రామికవేత్తల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
టెక్నాలజీ, నైపుణ్య అభివృద్ధి తదితర రంగాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్, ఎకానమిక్ ఫస్ట్ సెక్రటరీ వివేక్ రఘు రామన్, ఎంటర్ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్ డేనిస్ టాం తదితరులు పాల్గొన్నారు.