Mon Dec 23 2024 07:52:45 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ జగిత్యాలకు చెందిన వ్యక్తికి 30 కోట్ల లాటరీ..!
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి భారీ లాటరీని దక్కించుకున్నాడు. ఈ లాటరీ డబ్బుతో అతడి దశనే తిరిగిపోనుంది. జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ అనే డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడు. దుబాయ్ లో ఉంటున్న అజయ్ కొన్న లాటరీకి ఏకంగా రూ. 30 కోట్ల జాక్ పాట్ తగిలింది. నాలుగేళ్ల క్రితం ఉపాధికోసం దుబాయ్ కి వెళ్లిన అజయ్ అక్కడ ఒక జెవెలరీ షాప్ లో డ్రైవర్ గా పనికి కుదిరాడు. ఈక్రమంలో 30 దిర్హాములతో రెండు ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక టికెట్ కు రూ. 30 కోట్ల జాక్ పాట్ తగిలింది.
లాటరీని గెలుచుకున్న తర్వాత అజయ్ మాట్లాడుతూ "నేను జాక్‌పాట్ కొట్టినట్లు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని UAE దినపత్రిక, ఖలీజ్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఆభరణాల సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అజయ్.. ప్రతి నెలా 3,200 దిర్హామ్‌లు సంపాదిస్తున్నాడని ఖలీజ్ టైమ్స్ నివేదించింది. "నేను ఈ మొత్తంతో ఓ ఛారిటీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తాను. నా స్వస్థలం, పొరుగు గ్రామాలలో ప్రాథమిక అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది" అని అజయ్ చెప్పారు. జాక్‌పాట్ కొట్టి కోటీశ్వరులుగా మారామని భారతదేశంలోని తన కుటుంబ సభ్యులకు చెబితే వాళ్లు అసలు నమ్మలేదని అతను చెప్పాడు. అదే డ్రాలో 50 ఏళ్ల బ్రిటీష్ జాతీయురాలు పౌలా లీచ్ 77,777 దిర్హామ్‌లు గెలుచుకున్నారు.
Next Story