ఎన్నికల్లో పోటీ చేసే ఆ అభ్యర్థుల దరఖాస్తులను పక్కన పెట్టండి
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో..
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో రాష్ట్రంలో మరింత హీట్ పెరిగిపోయింది. వారి జాబితా విడులైనప్పటి నుంచి ఇతర పార్టీలు సైతం జోరందుకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ నెల మూడు వారంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వెయ్యికి పైగా దఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల జాబితాను పరిశీలించి వారి పేర్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ముందుగా తొలి జాబితాను విడుదల చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, దరఖాస్తులను స్వీకరిస్తోంది. నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకూ దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటికే పలువురు దఖాస్తులు చేసుకోగా, వాటి పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియను మొదలు పెట్టిన కమలం.. ఈనెల 10వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. తొలి దరఖాస్తును సికింద్రాబాద్ నుంచి రవి ప్రసాద్‌గౌడ్ అందజేశారు. సామ రంగారెడ్డి ఎల్బీనగర్ నుంచి అప్లై చేయగా, వేములవాడ నుంచి తుల ఉమ అభ్యర్థిగా దరఖాస్తు చేశారు. మొదటి రోజు 182 అప్లికేషన్లు వస్తే, రెండో రోజు మంగళవారం 178 దరఖాస్తులు వచ్చాయి.
బీజేపీ దరఖాస్తు ఫారంలో మొత్తం 4 పార్ట్లు ఉన్నాయి.
పార్ట్ -1లో బీజేపీలో ఎప్పుడు చేరారు? వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
పార్ట్-2లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ప్రస్తావించాలి. పార్ట్-3లో ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలను పేర్కొనాలి.
పార్ట్ - 4లో క్రిమినల్ కేసులేమైనా ఉంటే..ఆ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. మొత్తానికి బీజేపీ చరిత్రలోనే తొలిసారి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
వారి దరఖాస్తులు పక్కనపెట్టండి.. కిషన్ రెడ్డి..
కాగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మీడియాతో మాట్లాడితే వారి దరరఖాస్తులను పక్కన పెట్టాలని కిషన్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు.