గులాబీ పార్టీకి గుర్తుల టెన్షన్.. సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్!
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ సందడి జోరందుకుంది. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు..
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ సందడి జోరందుకుంది. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల గులాబీ బాస్ కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాగైన మూడో సారి కూడా పాలన పగ్గాలు చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో.. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు సన్నాహాలను ప్రారంభించారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే.. కొంతకాలం క్రితం జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తు.. కారు గుర్తును పోలిన కొన్నింటికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. కారు గుర్తుకు వేసే ఓట్లే.. అటు పోలయ్యాయని.. అలాంటి గుర్తులను ఈ ఎన్నికల్లో తొలగించాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి పార్టీ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. కొన్ని ఉదహరణలను సైతం ఎన్నికల సంఘానికి అందించింది.
ఢిల్లీ హైకోర్టులో పిటిషన్:
ఇక కారు గుర్తును పోలిన ఎన్నికల గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో సైతం పిటీషన్ దాఖలు చేయగా, ఈ క్రమంలో ఎన్నికల గుర్తుపై ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకుంది. కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. అచ్చం కారు తరహాలో ఉండే గుర్తుల వల్ల ఓటర్లు అయోమయానికి గురి అవుతున్నారని.. దీంతో ఆ గుర్తులకు ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రోడ్ రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తుల వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ప్రతీ ఓటు కీలకమైన నేపథ్యంలో కారు తరహాలో ఉండే గుర్తులను కేటాయిస్తే మరోసారి నష్టం జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. ఇప్పటికే ఈసీని కలిసి వినతపత్రం సైతం అందించారు బీఆర్ఎస్ నేతలు.