అసంతృప్తితో బండి సంజయ్.. కారణం ఏంటంటే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది. కానీ విడుదలైన మరుసటి రోజు నుంచే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది. కానీ విడుదలైన మరుసటి రోజు నుంచే అసంతృప్తులు మొదలయ్యాయి. అలకలు, కన్నీళ్లు, ఇలా ఒక్కటేమిటి కోపతాపాలు వంటివి కనిపిస్తున్నాయి. ఎవరో కాదు.. బండి సంజయ్ కూడా ఈ జాబితాపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు కరీంనగర్లో చోటు దక్కినా, తన అనుకున్నవాళ్లకు కొన్ని టికెట్లు కూడా ఇప్పించుకోలేక పోయినట్లు సంజయ్‌లో ఆవేదన ఉన్నట్లు సమాచారం. ఇక మాజీ ఎంపీ వివేక్ అయితే టికెట్ల విషయంలో ఎక్కడా తనను పరిగణనలోకి తీసుకోలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గోషా మహల్ టికెట్ విషయంలో విక్రమ్ గౌడ్, వరంగల్ వెస్ట్ విషయంలో రాకేష్, నర్సాపూర్ టికెట్ దక్కకపోవడంతో గోపి అవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు, ముథోల్ టికెట్ ఆశించిన రమాదేవి ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరు నేతలు కుట్రలు చేశారని, పార్టీకి రాజీనామా చేస్తానంటూ మీడియా ముందే చెప్పేశారు. ఇలా బీజేపీలోనే కాదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్లోనూ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అయితే అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీ బుజ్జగింపులు ప్రారంభించాయి. రానున్న రోజుల్లో మీకు మంచి అవకాశాలు లభిస్తాయని, ఎలాంటి అంసతృప్తులకు గురి కావద్దు అంటూ సముదాయించే ప్రయత్నాలు చేశాయి. కానీ కొందరు నేతలు ఆ బుజ్జగింపులతో సైలెంట్ అయిపోతుంటే మరి కొందరేమో ఇంకా అసంతృప్తి రాగాలు వెల్లగక్కుతూనే ఉన్నారు. తమకు పార్టీ అన్యాయం చేసిందని, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, అటువంటిది పార్టీ తమను గుర్తించలేదంటూ తమలోని బాధను వెల్లగక్కుతున్నారు.
తొలి జాబితా విడుదలపై అసంతృప్తిలో ఉన్న వారిపై హైకమాండ్ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 అమిత్ షా సూర్యాపేట రాబోతున్నారు. అక్కడ బహిరంగ సభ ఉండనుంది. అదే వేదికగా అసంతృప్త నేతలతో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమిత్ షా వచ్చి వెళ్లాక తెలంగాణ పర్యటనకు జేపీ నడ్డా సిద్దంగా ఉన్నారు.