Sun Dec 22 2024 14:12:10 GMT+0000 (Coordinated Universal Time)
ఆ విషయాన్ని రేవంత్ రెడ్డినే అడగండి: కిషన్ రెడ్డి
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అని
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొడవ పడితే ప్రజలకు నష్టమని.. సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని.. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా.. గుజరాత్‌లా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మోదీని పెద్దన్న అని రేవంత్ రెడ్డి ఎందుకు అన్నారో ఆయననే అడగాలని అన్నారు. అయినా పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరూ ఒక్కటి అయినట్లుగా భావిస్తారా? అనిప్రశ్నించారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సభలు విజయవంతమయ్యాయన్నారు. రేపటి నుంచి బీజేపీ మేనిఫెస్టో కోసం సలహాలను, సూచనలను స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుపై స్పష్టత లేకుండా పోయిందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవిత కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీని రేవంత్ పెద్దన్న అని సంభోదించారని.. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అర్ధం అవుతుందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ.. ఎలా పెద్దన్న అవుతాడని కవిత ప్రశ్నించారు.
Next Story