Mon Jan 06 2025 07:41:47 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు మూడు వర్గాలకు హ్యాపీ న్యూస్.. రేవంత్ సర్కార్ తాజా అప్ డేట్
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు సమావేశమై మూడు కీలక నిర్ణయాలను ఆమోదించనుంది.
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు సమావేశమై మూడు కీలక నిర్ణయాలను ఆమోదించనుంది. ఈ మూడు నిర్ణయాలతో తెలంగాణలో వివిధ వర్గాల ప్రజలకు సంబంధించిన ఇబ్బందులకు చెక్ పెట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే అ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలపై చర్చించి నిర్ణయం తీసుకుని ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. దీనికి సంబంధించిన అజెండాఇప్పటికే ఖరారు కావడంతో తెలంగాణ ప్రజలు ఈరోజు జరిగే కేబినెట్ సమావేశం వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ ప్రభుత్వం పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయాలు తీసుకోనుండటంతో విపక్షాల దృష్టి కూడా ఈ సమావేశంపై పడింది.
కొత్త రేషన్ కార్డుల మంజూరుపై...
తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసే విషయంపై నేడు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయిన తర్వాత రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. పదేళ్లలో అనేక మంది పేదలు దీని కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. తెలుపు రంగురేషన్ కార్డులుంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతాయి. అదే సమయంలో తమకు అన్ని రకాలుగా ప్రయోజనం దక్కుతుందని భావించి దీని కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలపై నేడు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులను ఇచ్చేందుకు అవసరమైన చర్యల గురించి చర్చించనున్నారు.
రైతు భరోసా విధివిధానాలపై...
ఇక మరొక ప్రధాన వర్గమైన రైతులు కూడా ఈ సమావేశం పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా విధివిధానాలపై చర్చించి నేడు నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులను తీసుకునే అవకాశముందని తెలిసింది. 14 వతేదీ నుంచిరైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనుంది. రైతుభరోసా కింద 7,500 రూపాయల నగదును జమచేయడానికి అవసరమైన విధివిధానాలను కేబినెట్ నేడు ఆమోదించనుంది. పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు, ఆదాయపుపన్ను చెల్లించని వారికి, ప్రభుత్వ ఉద్యోగులు కాని వారికి రైతు భరోసా ఇచ్చే అవకాశముంది.
ఇందిరమ్మ ఇళ్లపై నిర్ణయం...
దీంతో పాటు మరొక ప్రధాన మైన అంశం ఇందిరమ్మ ఇళ్లు. ఇందరిమ్మఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. లబ్దిదారుల సంఖ్యను తేల్చనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయించింది. ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల నగదు చెల్లించనుంది. అయితే తొలి విడతగా సొంత స్థలం ఉన్న వారినే ఈపథకం కింద ఎంపిక చేయనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ మూడు కీలక అంశాలపై నేడు కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story