Mon Nov 25 2024 17:32:45 GMT+0000 (Coordinated Universal Time)
కీలక సమయంలో కేసీఆర్ ఇలా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమయంలో జనాలకు అందుబాటులో లేకుండా పోయారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమయంలో జనాలకు అందుబాటులో లేకుండా పోయారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటం పార్టీకి ఇబ్బందికరమైన అంశమే. జిల్లాల పర్యటనను చేయాల్సిన సమయంలో ఆయన ఆరోగ్యం బాగాలేక విశ్రాంతి తీసుకుంటుండటం పార్టీ నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ఇంకా పెద్దగా సమయం లేదు. ఎన్నికల తేదీలు కూడా త్వరలో ఖరారు కానున్నాయి.
ఈసారి పరిస్థితి...
దీంతో పాటు ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. రెండుసార్లు అధికారంలోకి రావడం, తొమ్మిదేళ్ల నుంచి పాలన చేస్తుండటంతో సహజంగా కొంత వ్యతిరేక ఉండనే ఉంటుంది. ఈ సమయంలో కేసీఆర్ వంటి నేత జనంలో ఉండటం ఆ పార్టీకి అవసరం. అయితే ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థిితి ఇంకా మెరుగుపడలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక జాతీయ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని తెలిపారు.
మరికొన్ని రోజులు...
కేసీఆర్ ఛాతీలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని కేటీఆర్ చెప్పారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడంతో కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని కూడా కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతానికి ప్రచార బాధ్యతలను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు తమ భుజాన వేసుకున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ సభలు నిర్వహిస్తున్నారు. కానీ కేసీఆర్ వంటి నేత కీలక సమయంలో అందుబాటులో లేకపోవడంతో పార్టీ కొంత వెనకబడిందనే చెప్పాలి. కేసీఆర్ ఇప్పటికే జిల్లాల పర్యటన ప్రారంభించాల్సి ఉంది.
అందరికంటే ముందుగానే...
అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ ఇతరులకు షాక్ ఇచ్చారు. దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక ప్రచారమే మిగిలి ఉంది. గులాబీ బాస్ వేదిక ఎక్కితే ఆ జోష్ వేరు. కింది స్థాయి క్యాడర్ నుంచి నేతల వరకూ ఉత్సాహంగా పరుగులు తీస్తారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి మ్యానిఫేస్టో రూపకల్పనలో కేసీఆర్ నిమగ్నమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన త్వరగా కోలుకుని తమ నియోజకవర్గాలకు రావాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు.
Next Story