Mon Dec 23 2024 04:46:11 GMT+0000 (Coordinated Universal Time)
భద్రాచలానికి కేసీఆర్ వరాలు
భద్రాచలం ప్రాంతంలో ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మించాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు
భద్రాచలం ప్రాంతంలో ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మించాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వరద ప్రాంతాల పర్యటనకు వచ్చిన కేసీఆర్ అధికారులతో సమీక్ష చేశారు. వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని చెప్పారు. శాశ్వత కాలనీల కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వరదలతో ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. గోదావరికి యాభై అడుగుల నీరు వచ్చినా కాలనీలు మునిగిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీవినీ ఎరుగని వరదలు చూస్తున్నామన్నారు.
ప్రతి కుటుంబానికి పదివేలు..
తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు వెంటనే ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. మరో రెండు నెలలు ఇబ్బంది పడకుండా 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. వెయ్యి కోట్లతో పినపాక, భద్రాచలం ప్రాంత వాసులకు రెండు మూడు వేల ఇళ్లతో శాశ్వత కాలనీలను నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. 29 వ తేదీ వరకూ ముప్పు పొంచి ఉందని చెప్పారు. బూర్గంపాడు వద్ద కూడా కరకట్టను ఏ విధంగా నిర్మించాలో ప్రణాళిక రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఎంత వరద వచ్చినా ఆలయం వద్దకు నీరు రాకుండా చూడాలన్నారు.
పునరావాస కేంద్రాలను...
పునరావాస కేంద్రాలను మరికొన్ని రోజులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి వరద సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. భద్రాచలం కరకట్టను మరింత పటిష్టపర్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శాశ్వత కాలనీలకు తానే త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ట్రిపుల్ ఐటీ నుంచి నిపుణులను రప్పించి వారి సూచనలను తీసుకుంటామన్నారు. ప్రమాదం తప్పిపోలేదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్ అధికారులను అభినందించారు.
Next Story